భక్తుడి కోసం గరుడ వాహనం!

పాండురంగడిపై తుకారాం ఎన్నో అభంగాలను రచించాడు. ఆ అభంగాలను పాడుతూ ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందింపజేశాడు. శివాజీ మహారాజు సైతం అసమానమైన ఆయన భక్తిని ప్రత్యక్షంగా చూశాడు. తనని శిష్యుడిగా చేర్చుకోమని ఆయన అడగడం తుకారాం ఘనతను చాటుతోంది. తుకారాం పట్ల ద్వేష భావాన్ని వ్యక్తం చేసిన ముంభాజీ.. ఆయన అనుచరులు కూడా మనసు మార్చుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తుకారాంకి మోక్షాన్ని ప్రసాదించాలని పాండురంగడు నిర్ణయించుకున్నాడు. ఆయన్ని సశరీరంగా తన సన్నిధికి తీసుకు రావలసిందిగా గరుడ వాహనాన్ని ఆదేశించాడు. ఆ రాత్రి కలలో తుకారాంకి కనిపించి ఆయన కోసం గరుడ వాహనం పంపుతున్నట్టుగా చెప్పాడు. తన పూజలు ... భజనలు ఫలించినందుకు తుకారాం సంతోషంతో పొంగిపోయాడు.

తెల్లవారుతుండగా ఆయన చకచకా స్నానజపాలు ముగించుకుంటూ వుండటం చూసి, విషయమేవిటని అడుగుతుంది భార్య. పాండురంగడు తనని అనుగ్రహించాడనీ, ఆయన సన్నిధికి తనని తీసుకువెళ్లడానికి మరి కొద్దిసేపట్లో గరుడవాహనం రానుందని చెబుతాడు. భక్తి పారవశ్యంలో ఆయన అలా మాట్లాడుతున్నాడని భావించి జిజియా తన పని తాను చేసుకోసాగింది. భార్యా బిడ్డలను అలాగే వదిలి పాండురంగస్వామిని కీర్తిస్తూ తుకారాం ఇంద్రాణి నదీ తీరానికి చేరుకున్నాడు.

తన్మయత్వంతో ముందుకుసాగుతున్న తుకారాంని అనుసరిస్తూ గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. అంతా చూస్తుండగానే గరుడ వాహనం అక్కడికి వచ్చింది. తుకారాం ఆ వాహనం పై కూర్చోగానే అది ఆకాశ మార్గాన సాగిపోయింది. అలా సశరీరంతో వైకుంఠానికి చేరుకున్న భక్తుడిగా తుకారాం చరిత్రలో నిలిచిపోయాడు.


More Bhakti News