మంచాలమ్మ తల్లి ముచ్చట!

శ్రీ రాఘవేంద్రస్వామి తన శిష్యులతో కలిసి వివిధ ప్రదేశాలను దర్శిస్తూ వస్తుంటాడు. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన 'మంచాల' గ్రామానికి చేరుకుంటాడు. అప్పటికే బాగా చీకటిపడటంతో, ఆయన బసకి కావలసిన ఏర్పాట్లు చేయడానికి శిష్యులు సంసిద్ధమవుతూ వుంటారు. సరిగ్గా ఆ సమయంలోనే తనని రక్షించమంటూ ఓ స్త్రీ ఆర్తనాదం వారికి వినిపిస్తుంది. ఆ దిశగా చూసిన వారికి మంటల్లో చిక్కుకున్న ఓ స్త్రీ కనిపిస్తుంది.

శిష్యులు ఆందోళన చెందుతూ వుండగా, ఆ మంటలను వెంటనే ఆర్పేయవలసిందిగా వరుణ దేవుడిని ప్రార్ధిస్తాడు రాఘవేంద్రస్వామి. అంతే ఆ క్షణమే ఆకాశంలో ఉరుములు ... మెరుపులు పుట్టుకొస్తాయి. ఉన్నపళంగా కుండపోతగా వాన మొదలవుతుంది. దాంతో ఆ మంటలు ఆరిపోయి ఆ స్త్రీ రక్షించబడుతుంది. తనని కాపాడినందుకు రాఘవేంద్రస్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

ఆమెను మంచాలమ్మ తల్లిగా గుర్తించిన స్వామి, ప్రేమపూర్వకంగా నమస్కరిస్తాడు. ఆయన వలన కాపాడబడాలనే కోరికతోనే తాను ఆ విధంగా చేసినట్టు చెబుతుంది మంచాలమ్మ. తన బిడ్డ తన దగ్గర వుండాలని తల్లి కోరుకుంటున్నట్టుగానే, తాను కూడా ఆయన తన దగ్గర వుండాలని కోరుకుంటున్నానని అంటుంది. తల్లికి ఆనందాన్ని కలిగించడం కోసం ... బిడ్డల వంటి భక్తులను అనుగ్రహించడం కోసం ఇకపై మంచాలలోనే ఉండవలసిందిగా కోరుతుంది.

ఆ తల్లి అనుమతి కోసమే అప్పటి వరకూ నిరీక్షిస్తూ వచ్చిన రాఘవేంద్రస్వామి, బిడ్డగా ఆమె ముచ్చట తీర్చడం తన బాధ్యత అని చెబుతూ అందుకు సంబంధించిన ప్రయత్నాలకు శ్రీకారం చుడతాడు.


More Bhakti News