కొండగిరి సాయినాథుడు

శిరిడీని ప్రేమాభిమానాల నిలయంగా ... ఆప్యాయతానురాగాల వలయంగా మార్చిన దైవస్వరూపుడు సాయినాథుడు. ఆయనను అంతా ఓ ఆత్మబంధువుగా ఆరాధిస్తుంటారు ... పూజిస్తుంటారు. సాయిబాబా ఎక్కడ వుంటే అక్కడ ప్రశాంతత లభిస్తుందనీ, సంతోష సౌఖ్యాలు వికసిస్తాయని భక్తులు భావిస్తుంటారు. ఈ కారణంగానే ఆయన కొలువైన ఆలయాలు భక్తజన సందోహంతో సందడి చేస్తుంటాయి.

ఈ నేపథ్యంలోనే కొండగిరి సాయినాథుడు తన వైభవాన్ని చాటుకుంటున్నాడు. వరంగల్ జిల్లా 'వంచనగిరి' లో ఈ ఆలయం దర్శనమిస్తుంది. శిరిడీ సాయిబాబాకి పూలంటే ప్రాణం ... అందుకే ఆయన అప్పట్లోనే 'లెండి' అనే పేరుతో చిన్నపాటి ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేశాడు. పచ్చదనము ... పరిమళము ... ప్రశాంతతకు ఆయన ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఆయన అభిరుచికి తగినట్టుగానే ఈ ఆలయం నిర్మించబడింది.

చక్కని నిర్మాణ శైలిలో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఎటు చూసినా రకరకాల పూల మొక్కలు నయనానందాన్ని కలిగిస్తూ వుంటాయి. మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే అది లభిస్తుంది. విశాలమైన ముఖమంటపం ... వేదికపై సకలదేవతా స్వరూపమైన సాయినాథుడు దర్శనమిస్తూ వుంటాడు. ప్రేమానురాగాలతో నిండిన ఆయన చూపులు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా స్పర్శిస్తూ వుంటాయి.

శిరిడీలో మాదిరిగానే సాయిబాబాకి ఇక్కడ అభిషేకాలు ... హారతులు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి సాయికి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే, అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అనునిత్యం ఆయన సేవలో ఆనందంగా తరిస్తుంటారు.


More Bhakti News