వంటశాలలో వకుళమాత

తిరుమల కొండలలో అలసిపోయి తిరుగుతోన్న శ్రీనివాసుడిని ఓ తల్లిగా చేరదీసి ఆదరించింది వకుళమాత. శ్రీనివాసుడిని ఆమె ఎంతో అపురూపంగా చూసుకుంటూ వుండేది. ఆయనకి ఇష్టమైనవి చేసిపెట్టడం కోసం ఆమె ఎంతో కష్టపడుతూ వుండేది. పద్మావతిని చూసి శ్రీనివాసుడు మనసు పారేసుకున్నాడని తెలుసుకున్న ఆమె, వారి వివాహాన్ని తన చేతులమీదుగా జరిపించి సంతోషంతో పొంగిపోతుంది.

ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడిని పెంచిన యశోదాదేవియే కలియుగంలో వకుళమాతగా జన్మించిందని చెబుతారు. శ్రీ కృష్ణుడి వివాహాన్ని చూడలేకపోయినందుకు ఆ యుగంలో యశోదాదేవి బాధపడుతూ వుంటే, కలియుగంలో ఆమె ముచ్చట తీరుస్తానని శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడట. ఆ మాట ప్రకారం శ్రీ కృష్ణుడు ... శ్రీనివాసుడుగా అవతరించగా, యశోదాదేవి వకుళమాతగా అవతరించింది.

అలా ద్వాపర యుగంలోను ... కలియుగంలోను ఆమెకి స్వామితో గల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. స్వామి అలవాట్లు ... అభిరుచులు ఆమెకంటే మరొకరికి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. అందువల్లనే ఆమె శ్రీనివాసుడి వంటశాలలో కూర్చుని వివిధ రకాల వంటకాల తయారీని పర్యవేక్షిస్తూ ఉంటుందని చెబుతుంటారు. అందుకు గుర్తుగా ఆమె విగ్రహం వంటశాలలో కనిపిస్తూ వుంటుంది.

ఓ తల్లి తన బిడ్డకి ఇష్టమైన వంటకాలు తగిన రీతిలో చేయబడుతున్నాయో లేదో ... సమయానికి అందజేయబడుతున్నాయో లేదో అనే విషయం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా కనిపించే ఈ దృశ్యం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.


More Bhakti News