పసిబిడ్డను తిరిగిచ్చిన పాండురంగడు

ఓ రోజున భక్త గోరాను వెతుక్కుంటూ ఆయన ఇంటికి వస్తాడు నామదేవుడు. ఆయన పాండురంగస్వామి కోసం తన ఇంటికి రావడం గోరాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన ఇంట్లో పనివాడిగా వున్న రంగడే .. పాండురంగస్వామి అని నామదేవుడు చెప్పడంతో గోరా నిర్ఘాంతపోతాడు. ఎంతగా వెతికినా రంగడు కనిపించక పోవడంతో నామదేవుడు మాటలు నిజమేనని నమ్ముతాడు.

సాక్షాత్తు పాండురంగస్వామితో సేవలు చేయించుకున్నందుకు నొచ్చుకుంటాడు. ఓ సాధారణమైన మనిషిగా తన కోసం కష్టాలు పడిన పాండురంగస్వామిని తలచుకుంటూ కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఆయన ఎడబాటును భరించలేనంటూ పాండురంగస్వామి ఆలయానికి వెళతాడు. ఒక్కమారు తనకి కనిపించమంటూ వేడుకుంటాడు. ఆయన ఆలయం నుంచి కదలకుండా కూర్చోవడం గురించి తెలిసి గ్రామస్తులంతా అక్కడికి చేరుకుంటారు.

రంగడిగా గోరాకి సేవలు చేసిన పాండురంగడు ఆయన ఎదుట ప్రత్యక్ష్యమవుతాడు. ఆయన పాదాలపై సాష్టాంగపడి గోరా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు. అసమానమైన భక్తి శ్రద్ధలతో తనని కట్టిపడేసిన గోరాను స్వామి అభినందిస్తాడు. ఆయన కుటుంబానికి తన పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుందని చెబుతాడు. తనకి ఇచ్చిన మాట కోసం రెండు చేతులను నరికేసుకున్న గోరాకు, తిరిగి రెండు చేతులనూ ఇస్తాడు.

తన పసిబిడ్డను తానే చంపుకున్నందుకు బాధపడుతోన్న గోరాను ఆ దుఃఖం నుంచి బయటపడేయడం కోసం ఆ బిడ్డని తిరిగి ప్రసాదిస్తాడు పాండురంగడు. తమకి కడుపు కోత మిగిల్చి వెళ్లిన తమ బిడ్డ తిరిగి తమ చేతుల్లోకి రాగానే గోరా దంపతులు సంతోషంతో పొంగిపోతారు. నిరంతరం స్వామి సేవలోనే తమ జీవితాన్ని తరింపజేసుకుంటామంటూ ఆయన పాదాలకు నమస్కరిస్తారు.


More Bhakti News