మహా గణపతి క్షేత్రం

సాధారణంగా సోమవారం రోజున శివాలయానికి ... శనివారం రోజున వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వెళుతుంటారు. అలాగే మిగతా రోజుల్లో ఆయా దైవాలకి ఇష్టమైన రోజుల్లో ఆయా దైవాలను భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో అన్ని రోజులలో పూజాభిషేకాలు అందుకునే దైవంగా వినాయకుడు కనిపిస్తూ వుంటాడు.

ఇక వినాయకుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత శక్తిమంతమైనవిగా అలరారుతుంటాయి. ఇలాంటి క్షేత్రాల్లో ఏడాది పొడవునా భక్తుల రద్దీ కనిపిస్తూ వుంటుంది. ఈ తరహాలో కోరిన వెంటనే కోటి వరాలను అందించే గణపతి క్షేత్రం మనకి మహారాష్ట్ర - నాందేడ్ సమీపంలోని 'త్రికూట్' లో దర్శనమిస్తుంది.

ఏడాదిలో ఆరు నెలల పాటు గోదావరి నదీ తీరంలో కనిపించే ఈ ఆలయం, ఆ తరువాత నదీ గర్భంలో వుంటుంది. అందువలన ఈ ఆరు నెలలపాటు పూజించుకోవడం కోసం భక్తులు మరో గణపతిని నాందేడ్ లో ప్రతిష్ఠించుకున్నారు. అటు స్వయంభువు గణపతి ... ఇటు ప్రతిష్ఠిత గణపతి రెండూ కూడా మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలోనే సిందూర వర్ణంలో కనిపిస్తుంటాయి ... పూజలు అందుకుంటూ వుంటాయి.

స్వయంభువు గణపతి ఆవిర్భవించిన ప్రదేశం ప్రశాంతంగా ... మనోహరంగా దర్శనమిస్తూ వుంటుంది. పూర్వం ... ఇక్కడి స్వామి మహిమాన్వితుడని తెలుసుకున్న నాగ్ పూర్ రాజావారు వెంటనే దర్శనం చేసుకున్నారట. చర్మ వ్యాధితో బాధపడుతోన్న ఆయన తనని ఆ వ్యాధి బారి నుంచి బయటపడేయమని ప్రార్ధిస్తూ, స్వామి సన్నిధిలోనే చాలాకాలం పాటు గడిపాడు.

స్వామి అనుగ్రహంతో వ్యాధి తగ్గిపోవడంతో, ఆయన ఆనందానికి హద్దులేకుండా పోయిందట. ఆనాటి నుంచి ఆయన ఈ ఆలయానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించాడు. అలా నాటి నుంచి నేటి వరకూ భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.


More Bhakti News