రామయ్యలో కలిసిన త్యాగయ్య

శ్రీరాముడి సేవలో భర్తతో కలిసి పాలుపంచుకున్న త్యాగయ్య భార్య, సీతారాముల విగ్రహాలు కనిపించకుండా పోవడంతో బెంగపెట్టుకుంటుంది. ఆ విగ్రహాలు దొరికేంత వరకూ ఉపవాసాలు చేస్తుంది. విగ్రహాలు లభించినా అప్పటి వరకూ ఆమె చేసిన ఉపవాసాల ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతో ఆ శ్రీరాముడి సన్నిధిలో ... భర్త ఒడిలో ఆమె ప్రాణాలు విడుస్తుంది.

ఆ మహా ఇల్లాలు పోవడంతో ఆ బాధ నుంచి తేరుకోవడానికి త్యాగయ్యకి కొంత సమయం పడుతుంది. ఆ తరువాత ఆయనకి శ్రీ రాముడి పూజా మందిరమే ప్రపంచంగా మారిపోతుంది. స్వామిపై అనేక కృతులు రచిస్తూ ... పాడుతూ పరవశించి పోతుంటాడు. ఆ గ్రామస్తులందరూ కూడా సాక్షాత్తు తాము అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఎదురుగా ఉన్నట్టుగానే భావిస్తూ ఉండేవాళ్లు.

త్యాగయ్య కృతులలోని మాధుర్యానికి ... అసమానమైన ఆయన భక్తికి శ్రీరాముడు ముగ్ధుడవుతాడు. సీతా సమేతంగా ... లక్ష్మణ ... హనుమ సహితంగా త్యాగయ్యకి దర్శనమిస్తాడు. ఫలానా రోజున ఆయనని తన సన్నిధికి చేర్చుకోనున్నట్టు ముందుగానే చెబుతాడు. ''కనుగొంటిని శ్రీరాముని'' అనే కృతితో త్యాగయ్య తన సంతోషాన్ని చాటుకుంటాడు.

తనకీ ... రాముడికి మధ్య జరిగిన సంభాషణ గురించి తన అన్నగారితో చెబుతాడు త్యాగయ్య. తాను విశ్వసించిన ... ఆరాధించిన ... నిరంతరం ప్రేమిస్తూ వచ్చిన శ్రీరామచంద్రుడిలో ఓ శుభ ముహూర్తాన ఆనందంగా ఐక్యమైపోతాడు.


More Bhakti News