సారంగాపూర్ హనుమంతుడు

గ్రహదోషాలు ... దుష్టశక్తులచే పీడించబడుతున్నవారికి ముందుగా గుర్తుకు వచ్చే దైవం హనుమంతుడు. ఆయన అనుగ్రహం వుంటే కష్టాలు కనుమరుగైపోతాయని అంతా విశ్వసిస్తూ వుంటారు. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు ఎప్పుడు చూసినా భక్తులతో రద్దీగా దర్శనమిస్తుంటాయి.

హనుమంతుడు ఆవిర్భవించిన స్వయంభువు ఆలయాలు మరింత మహిమాన్వితమైనవిగా చెబుతుంటారు. అలాంటి విశిష్టమైన క్షేత్రాలలో నిజామాబాద్ జిల్లా 'సారంగాపూర్' ఒకటి. ఇక్కడ హనుమంతుడు ఆవిర్భవించడానికి వెనుక ఆసక్తికరమైన కారణం వుంది. పూర్వం ఈ ప్రాంతంలో కరవుకాటకాలు ఏర్పడినప్పుడు, వేదపండితులు స్వామి దీక్షను చేపట్టి ఆయనను ఆరాధించసాగారు.

అదే సమయంలో సమర్ధ రామదాసు ఆ గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకుని వేదపండితులతో కలిసి ఆరాధించాడు. దాంతో అంతా చూస్తుండగానే అక్కడి శిలపై హనుమంతుడి రూపం ఏర్పడిందట. స్వామి అనుగ్రహంతో ఆ ప్రాంతంలో వర్షాలు కురవడం ... పంటలు పండటం జరిగాయి.

ఆనాటి నుంచి ఇక్కడి వాళ్లంతా స్వామిని ఇలవేల్పుగా భావించి పూజిస్తున్నారు. ఆనందకరమైన తమ జీవితానికి ఆంజనేయస్వామి కారకుడని వాళ్లంతా చెబుతుంటారు. ఆలయనిర్మాణం అలనాటి వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటుంది. గర్భాలయంలో స్వామి సిందూర వర్ణంలో దర్శనమిస్తుంటాడు.

ఇదే ప్రాంగణంలో స్వామివారిని ఆరాధించిన పండితుల మందిరాలు వరుసగా కనిపిస్తుంటాయి. ఈ మందిరాలలో వారి పాదుకలను భక్తులు పూజిస్తుంటారు. ప్రతి మంగళ ... శని ... ఆదివారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. హనుమజ్జయంతి సందర్భంగా ఇక్కడ విశేష పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.


More Bhakti News