దీపావళి పరమార్థం

దీపావళి అంటే సంతోషం ... సందడి ... సంబరం. ఈ రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో ... మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటిపడే సరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటులేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది.

చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.

ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.

ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు. ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు.

మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. ధనత్రయోదశి .. నరకచతుర్దశి .. దీపావళి ... బలిపాడ్యమి ... యమద్వితీయ అయిదు రోజుల పండుగలా భావిస్తుంటారు కనుక కొందరు అయిదు దీపాలను వెలిగిస్తుంటారు. భూదేవి దీపం వేడిని భరించలేదట. అందువలన ప్రమిదలో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు ... ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు.


More Bhakti News