అష్టదిక్పాలకులు

అనంతమైన ఈ విశ్వానికి తూర్పు .. పడమర .. ఉత్తరం .. దక్షిణం .. ఆగ్నేయం .. నైరుతి .. వాయువ్యం .. ఈశాన్యం అనే అష్టదిక్కులు చెప్పబడ్డాయి. ఈ ఎనిమిది దిక్కులకు దేవేంద్రుడు .. వరుణుడు .. కుబేరుడు .. యముడు .. అగ్ని .. నైరుతి .. వాయువు .. ఈశ్వరుడు అధిపతులుగా వ్యవహరిస్తూ వుంటారు. వీరినే అష్టదిక్పాలకులు అంటారు. విశ్వంలోని సమస్త విషయాలకు సూర్య చంద్రుల తరువాత వీరినే ప్రత్యక్ష సాక్ష్యులుగా పేర్కొనడం జరుగుతూ వుంటుంది.

దేవేంద్రుడి భార్య శచీదేవి ... ఆయన వాహనం ఐరావతం. వజ్రాయుధాన్ని కలిగి తూర్పు దిక్కుకి ఆయన అధిపతిగా వ్యవహరిస్తూ వుంటాడు. వరుణుడి భార్య పేరు కాళికాదేవి .. ఆయన వాహనం మొసలి ...'పాశం' అనే ఆయుధాన్ని కలిగి పడమర దిక్కుకి అధిపతిగా పరిపాలన కొనసాగిస్తూ వుంటాడు. ఇక కుబేరుడి భార్యపేరు చిత్రరేఖ ... ఆయన వాహనం నరుడు ... ఖడ్గాన్ని కలిగి ఉత్తరం దిక్కు పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తూ వుంటాడు.

ఇక యముడి భార్యపేరు శ్యామలాదేవి ... ఆయన వాహనం దున్నపోతు ... 'కాలదండం' అనే ఆయుధాన్ని ధరించి దక్షిణ దిక్కు అధిపతిగా వ్యవహరిస్తూ వుంటాడు. అగ్నిదేవుడి భార్యపేరు స్వాహాదేవి ... ఆయన వాహనం తగరు .. 'శక్తి' అనే ఆయుధాన్ని కలిగి ఆగ్నేయానికి అధిపతిగా వ్యవహరిస్తూ వుంటాడు. నైరుతి భార్యపేరు దీర్ఘాదేవి ... ఆయన వాహనం గుర్రం ... 'కుంతం' అనే ఆయుధాన్ని కలిగి నైరుతి దిక్కు పాలనను కొనసాగిస్తూ వుంటాడు.

వాయుదేవుడి భార్యపేరు అంజనాదేవి ... ఆయన వాహనం లేడి ... 'ధ్వజం' అనే ఆయుధం కలిగి వాయువ్య దిక్కుని పాలిస్తుంటాడు. ఇక ఈశాన్య దిక్కుకు శివుడే అధిపతి .. ఆయన భార్య పార్వతీదేవి ... త్రిశూలం' ధరించి వృషభ వాహనాన్ని అధిరోహించి పాలనా సంబంధమైన విషయాలను పర్యవేక్షిస్తూ వుంటాడు.


More Bhakti News