నరక చతుర్దశి రోజున ఏం చేయాలి?

దీపం ... చీకట్లను తరిమేసి వెలుగును ప్రసాదిస్తుంది. వెలుగు మంచికి సంకేతమైతే, చెడుకు చీకటి ప్రతీకగా కనిపిస్తుంది. లోక కల్యాణానికి ఆటంకాన్ని కలిగించే చెడు అనే చీకటిని పారద్రోలడానికి అనేక దీపాల వెలుగులు అవసరమవుతాయి. అందుకోసం సమస్త మానవాళి వెలిగించబడిన దీపాల వరుసనే 'దీపావళి' అంటారు.

సంతోషానికి ... సంబరానికి నిర్వచనంగా నిలిచే ఈ పండుగను రెండు రోజులపాటు జరుపుకోవడం జరుగుతుంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశిని 'నరకచతుర్దశి' అంటారు. ఆ మర్నాడు వచ్చే అమావాస్యను దీపావళి పర్వదినంగా ఆచరిస్తుంటారు. ఈ నేపథ్యంలో 'నరక చతుర్దశి' రోజున ఏం చేయాలనే విషయంలో కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటూవుంటాయి.

ఈ చతుర్దశి యమధర్మరాజుకి ఎంతో ఇష్టమైనది కనుక ఆయనను శాంతింపజేయాలని అంటూవుంటారు. ఈ రోజున నూనెలో లక్ష్మీదేవి ... నీటిలో గంగాదేవి కొలువై వుంటారు గనుక, తలకి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలని చెబుతుంటారు. స్నానానికి ముందు ఈ నీటిని ఉత్తరేణి చెట్టుకొమ్మతో కలియబెట్టుకోవడమే కాకుండా, స్నానం మధ్యలో ఆ చెట్టు కొమ్మను తలచుట్టూ తిప్పుకోవాలని అంటారు.

ఆ తరువాత దక్షిణాభిముఖంగా వుండి యమధర్మరాజుకి నువ్వులతో మూడుమార్లు తర్పణమిచ్చి ఆయనకి గల వివిధ నామాలను స్మరిస్తూ వుండాలి. ఇక ఈ రోజున మినుములతో చేసిన పదార్ధాలను మాత్రమే ఆహారంగా తీసుకోవలసి వుంటుంది. ఈ రోజు సాయంత్రం ఇళ్లలోనూ ... వాకిళ్ళలోను దీపాలను వెలిగించి వరుసగా పేర్చాలి. ఈ విధంగా చేయడం వలన నరక బాధల బారినపడకుండా వుండటం జరుగుతుందని అంటారు.


More Bhakti News