సాయి దివ్య మందిరం

మల్లె తోటలా పరిమళాన్ని ... మంచుకొండలా చల్లదనాన్ని పంచే సాయిని ఆరాధించే వారి సంఖ్య అపరిమితంగా వుంటుంది. ఆపద వచ్చినా ... ఆర్ధికపరమైన ఇబ్బంది వచ్చినా పిలిస్తే సాయి పలుకుతాడనడానికి ఎన్నో నిదర్శనాలు వున్నాయి ... మరెన్నో ఆధారాలు వున్నాయి. తన సమాధి నుంచే తన సహాయ సహకారాలు లభిస్తాయని సాయి చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్లు నిజమని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. అనంతమైన వారి విశ్వాసం కారణంగానే నేడు అడుగడుగునా సాయి మందిరాలు ఆవిర్భవిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అలరారుతోన్న మరో సాయి మందిరం హైదరాబాద్ - పంజాగుట్టలో దర్శనమిస్తుంది. ఇక్కడి ద్వారకానగర్ కాలనీలోని బాబా మందిరం రెండు అంతస్తులుగా నిర్మించబడి వుంది. కింది అంతస్తులో ధ్యానమందిరం ... పై అంతస్తులో బాబా కొలువుదీరిన వేదిక దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఎడమవైపున 'ధుని' కనిపిస్తుంది. మెట్ల ఆరంభంలో గల గణపతికి నమస్కరించి బాబా సన్నిధిలోకి అడుగుపెడతారు.

విశాలమైన ముఖమంటపంలో బాబా ప్రశాంతమైన వదనంతో కొలువై వుంటాడు. సాయి అభిషేకాల్లో భక్తులు స్వయంగా పాల్గొంటూ వుంటారు. సాయి పాదుకలను స్పర్శించిన భక్తులు, ముఖమంటపంలో కూర్చుని సాయి సమ్మోహన రూపాన్ని దర్శిస్తూ తరిస్తారు. ఆ తరువాత ధ్యాన మందిరంలో కూర్చుని ధ్యానం చేసుకుంటారు. బాబా జీవితంలోని ముఖ్యఘట్టాలను ఆవిష్కరిస్తూ ఏర్పాటు చేయబడిన చిత్రపటాలను చూసి తమని తాము మరిచిపోతారు.

శిరిడీలో మాదిరిగానే ఇక్కడ సాయికి నాలుగు హారతులు ... పల్లకీ సేవ ... పవళింపుసేవ జరుగుతూ వుంటాయి. గురుపౌర్ణమి రోజున ... బాబా సమాధి చెందిన విజయదశమి రోజున మాత్రమే కాకుండా, వివిధ పర్వదినాల్లోను ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. విశేష సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని పునీతులవుతుంటారు.


More Bhakti News