వరాలనిచ్చే తపస్సు

సాధారణంగా ఎవరైనా ఏదైనా ఒక పనిని గురించి తీవ్రంగా కృషి చేసి అందులో విజయం సాధించినప్పుడు, ఆ పనిని ఒక తపస్సుగా చేసినట్టు చెబుతుంటారు. అంటే తపస్సు చేయడం వలన, ఆశించిన ఫలితం అందుతుందనే విషయం అర్ధమవుతోంది. పూర్వం ఇటు దేవతలు ... అటు దానవులు కూడా తపస్సులు చేసిన వారే, తాము కోరుకున్న వరాలను పొందిన వారే.

ఇక ఎంతో మంది మహర్షులు ... మునులు తమ జీవితాలను తపస్సుకి ధారపోశారు. తపస్సు మనసుని ... శరీరాన్ని పవిత్రం చేస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రదేశాలను సైతం ప్రభావితం చేస్తుంది. తపస్సు కారణంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ... భగవంతుడి కృప కారణంగా ఆశించినది ఫలిస్తుంది.

ఈ నేపథ్యంలో తపస్సు అంటే ఏమిటో ... దేనిని ఆశించి అది చేయాలో తెలియక చాలామంది సతమతమై పోతుంటారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని అది పూర్తయ్యేంత వరకూ ఒక దేవతను ఒక మంత్రంతో ఆరాధిస్తూ ఉండటాన్నే తపస్సు అంటారు. తపస్సు పూర్తయ్యేంత వరకూ ఏ లక్ష్యాన్ని కోరి అది చేస్తున్నామో అది నెరవేరెంత వరకూ మనసు - దృష్టి దానిపైనే లగ్నం చేయాలి.

అయితే తపస్సు ద్వారా ఆశించే ఫలితం సత్య సమ్మతంగా ... ధర్మ బద్ధంగా వుండాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ నియమాన్ని పాటించడం వల్లనే మంత్రానికి సంబంధించిన అధిదేవత అనుగ్రహం త్వరగా లభిస్తుందనీ, కోరిన వరాలు దక్కుతాయని స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News