ఆంజనేయుడి ఆవాసం కొండగట్టు

ఆంధ్రదేశంలో 'కొండగట్టు ఆంజనేయస్వామి'కి ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నాయి. కరీంనగర్ జిల్లాలో వెలసిన ఈ ఆంజనేయస్వామి మహాశక్తిమంతుడనీ ... దుష్టగ్రహ పీడలనుంచి విముక్తి కలిగించడమే కాకుండా, కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగానే గుట్టలు ... గుహలు ... అనేక వృక్ష జాతులను కలిగివున్న ఈ ప్రాంతానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
రావణ సంహార సమయంలో లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు ఆంజనేయుడు సంజీవిని పర్వతాన్ని తీసుకు వెళుతుండగా, అందులోని కొంతభాగం ఈ ప్రదేశంలో పడి 'కొండగట్టు'గా మారిందని చెబుతుంటారు. ఆ తరువాత కాలంలో ఆంజనేయుడు ఇక్కడ వెలిశాడని అంటుంటారు. కాలక్రమంలో మరుగున పడిపోయిన ఈ విగ్రహం తిరిగి వెలుగు చూడటం గురించి, ఇక్కడి స్థలపురాణం వివరిస్తోంది.

చాలాకాలం క్రితం ఓ యాదవుడు ఈ ప్రదేశంలో పశువులను మేపడానికి వచ్చాడు. మందలో నుంచి ఒక ఆవు తప్పిపోవడంతో దానిని వెదకసాగాడు. ఆ ప్రయత్నంలో అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రమించగా, అప్పుడు అతని కలలో ఆంజనేయస్వామి కనిపించి ఆవు జాడ చెప్పాడు. అంతే కాకుండా తాను ఫలానా పొదలో ఉన్నాననీ ... తనని అక్కడి నుంచి వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పాడు.

ఆ యాదవుడు ఆ ప్రకారం స్వామివారి విగ్రహాన్ని బయటికి తీశాడు. ఓ వైపు నృసింహస్వామి ... మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం ... శంఖు చక్రాలు .... హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఇది సంజీవిని పర్వతంలోని ఓ భాగంగా చెప్పుకుంటున్నందు వలన, ఆయురారోగ్యాలను ఆశిస్తూ భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు.


More Bhakti News