కర్పూర హారతి విశిష్టత

దైవ దర్శనం కోసం ... ఆయన అనుగ్రహం కోసం ... అంతా ఆలయాలకి వెళుతుంటారు. పూజ పూర్తయిన తరువాత స్వామివారికి చూపించిన హారతిని కళ్లకి అద్దుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంటారు. అయితే పూజ పూర్తయిన తరువాత దైవానికి కర్పూర హారతి ఎందుకు ఇస్తారనే సందేహం చాలామందిలో తలెత్తుతుంటుంది.

పూర్వం దేవాలయాల్లోని గర్భాలయాల్లో దీపారాధన వెలుగులో మాత్రమే మూలమూర్తి కనిపిస్తూ వుండేది. అందువలన దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులకు మూలమూర్తి రూపం ... అలంకారం కనిపించాలనే ఉద్దేశంతో హారతి ఇచ్చేవారు. హారతిని మూలమూర్తికి దగ్గరగా ... ఎదురుగా వుంచి మూడుమార్లు శిరస్సు నుంచి పాదాల వరకూ గుండ్రంగా తిప్పడంలోని ఉద్దేశం ఇదే.

హారతి వెలుగులో దైవం యొక్క రూపాన్ని చూసి తరించిన భక్తులు, ఆ రూపాన్ని మనసులో ముద్రించుకుని తరిస్తుంటారు. ఇక కర్పూరానికి రూపం ... రంగు ... గుణం ... వంటివి వున్నాయి. అది ఆ రూపాన్ని ... రంగుని ... గుణాన్ని దైవసేవలో వదిలి ఆయనలో కలిసిపోతుంది. భగవంతుని సేవకి జీవితాన్ని అంకితం చేయాలనే విషయాన్ని సమస్త మానవాళికి చాటిచెబుతోంది.

రూపం ... గుణం ... లక్షణం ... జీవితం ఇవన్నీకూడా భగవంతుని ప్రసాదాలనీ, నేను ... నాది అనే అహానికి పోకుండా వాటిని భగవంతుడి సేవకే అర్పించాలనే సత్యాన్ని స్పష్టం చేస్తోంది. అందుకే కర్పూర హారతి అంతటి ప్రత్యేకతను ... అనంతమైన విశిష్టతను సొంతం చేసుకుంది.


More Bhakti News