విరూపాక్షపురం

తన భక్తులను పరీక్షించడం ... వారి భక్తికి మెచ్చి వరాలను ఇవ్వడం మహా శివుడికి మహా ఇష్టమని తెలుస్తోంది. అలా సదాశివుడు వెలసిన పరమపావన పుణ్య క్షేత్రమే 'విరూపాక్ష పురం'. శ్రీకాళహస్తి తాలూకా తొట్టెంబేడు మండలానికి చెందిన ఈ ఊళ్లో స్వామి అర్థనారీశ్వరుడిగా అవతరించాడు. గర్భాలయంలో రెండు ముఖాలు కలిగిన శివలింగాన్ని అర్థనారీశ్వర రూపంగా భావిస్తుంటారు.

ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణం 'శివపురాణం'లో కనిపిస్తుంది. ద్వాపరయుగంలో విజయుడు ... సుభగ అనే భార్యా భర్తలు శ్రీకాళహస్తి చేరుకొని, సువర్ణముఖీ నదీ తీరంలో ఓ పర్ణశాలను నిర్మించుకుని నిరంతరం శివనామ స్మరణ చేస్తూ వుండేవారు. యవ్వనవతి అయిన భార్య వెంటవుంటే శివ ధ్యానానికి భంగం వాటిల్లుతుందని భావించిన విజయుడు, ఆమెను వదలి విరూపాక్షపురానికి చేరుకున్నాడు. అక్కడే శివుడి కోసం తపస్సు చేస్తూ తన జీవితాన్ని కొనసాగించసాగాడు. భర్త తనని ఏ కారణంగా వదలి వెళ్లాడనేది గ్రహించిన సుభగ కూడా శివారాధనలో మునిగిపోయింది.

ఆ భార్యా భర్తలను పరీక్షించాలనుకున్న శివుడు ... ఇద్దరినీ వేరు వేరుగా మారువేషాల్లో కలుసుకుని, విషయసుఖాల వైపు వారి మనసును మళ్లించడానికి ప్రయత్నించాడు. అయితే ఇద్దరు కూడా విషయ సుఖాలపట్ల విముఖతను వ్యక్తం చేస్తూ, విశ్వేశ్వరుడి ధ్యానంలోనే అసలైన సుఖముందని చెప్పారు. ఇద్దరికీ కూడా తన ధ్యాస తప్ప మరేమీలేదని తెలుసుకున్న ఈశ్వరుడు వారిని అనుగ్రహించాడు. ఇక మీదట ఆ దంపతుల పేరుమీద 'సుఖగాంబ విజయేశ్వరస్వామి'గా పూజలందుకుంటానని వరమిచ్చాడు. విశేషమైనటు వంటి పర్వదినాల్లో భక్తులు అత్యధిక సంఖ్యలో ఇక్కడి స్వామివారిని దర్శిస్తూ ... ఆ తన్మయత్వంలో తరిస్తూ వుంటారు.


More Bhakti News