శ్రీ ముత్యాలమ్మ క్షేత్రం

జగన్మాత అయిన అమ్మవారు భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ గ్రామాల్లో ఆవిర్భవించింది. గ్రామదేవతగా వివిధ నామాలతో నిత్యపూజలు అందుకుంటోంది. సాధారణంగా ముత్యాలమ్మ మందిరాలు చాలా చిన్నవిగా కనిపిస్తూ వుంటాయి. కానీ నెల్లూరు జిల్లా తూర్పు కనుపూరుకి చెందిన ముత్యాలమ్మ ఆలయం, ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలను తలపిస్తుంది.

19 వ శతాబ్దం తొలినాళ్లలో ఇక్కడి ముత్యాలమ్మ కూడా చిన్న మందిరంలోనే వుండేది. ఆ తరువాత ప్రస్తుతం కనిపిస్తోన్న ఆలయం నిర్మించబడింది. సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణంగా ఈ ఆలయం కనిపిస్తూ వుంటుంది. వేలాదిమంది భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారిని ఒకేసారి దర్శించుకోవచ్చు.

శిల్పకళా శోభితమైన రాజగోపురం ... నగిషీలతో తీర్చిదిద్దిన ప్రాకారాలు దాటుకుని లోపలికి వెళితే, ముందుగా 'పోతురాజు పీఠం' కనిపిస్తుంది. భక్తులు ఇక్కడ పూల మాలలను ... నిమ్మకాయలను సమర్పిస్తూ వుంటారు. అనేక సింహ ప్రతిమలతో నిర్మించబడిన ముఖమంటపంలోకి వెళ్లి గర్భాలయంలోని ముత్యాలమ్మను దర్శించుకోవాలి.

గర్భాలయంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి శక్తిస్వరూపిణిగా కనిపిస్తుంది. నాగపడగలు గల కిరీటాన్ని ధరించి విశాలమైన నేత్రాలతో ... తళుక్కుమనే ముక్కెరతో ... కోరలను కలిగి వుంటుంది. గర్భాలయంలో గల పుట్టశిలను స్వయంభువుగా ఆరాధిస్తూ, తమని చల్లగా చూసే ఈ తల్లికి భక్తులు పొంగళ్ళను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ప్రతియేటా ఉగాదికి ముందుగా వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకూ జాతర నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా జరిగే గ్రామోత్సవాన్ని చూసి తీరవలసిందే. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ గ్రామోత్సవంలో పాల్గొంటారు. ముత్యాలమ్మ తల్లి దీవెనలు అందుకుని, మొక్కుబడులు చెల్లించి వెళుతుంటారు.


More Bhakti News