కావేరీ నదిలో కాలినడక !

త్యాగయ్య అనునిత్యం పూజించే సీతారాముల విగ్రహాలను ఆయన అన్నావదినలు దొంగిలిస్తారు. ఎవరూ చూడకుండా ఒకనాటి రాత్రివేళ వాటిని కావేరీ నదిలో పారేస్తారు. ఈ విషయం తెలియని త్యాగయ్య, ఆ విగ్రహాలను గురించి వెతుకుతూ అనేక పుణ్య క్షేత్రాలను దర్శిస్తాడు. త్వరలోనే తాను తిరిగి వస్తానంటూ కలలో రాముడు కనిపించి చెప్పడంతో, తన ఊరుకి బయలుదేరుతాడు.

పల్లకీ ఊరు ముందుకి చేరుకుంటుంది ... కానీ ఎదురుగా కావేరి నదీ ఉధృతంగా ప్రవహిస్తూ వుంటుంది. ప్రవాహం యొక్క ఉధృతి తగ్గెంత వరకూ నిరీక్షించడం మంచిదని త్యాగయ్యతో బోయలు చెబుతారు. అక్కడి వరకూ తనని తీసుకు వచ్చిన రామలక్ష్మణులే తనని కావేరీ నదిని కూడా దాటిస్తారంటూ నదివైపు నడిచాడు త్యాగయ్య. బోయలు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా ఆయన రామ నామస్మరణ చేస్తూ కావేరీ నదిలో నడవడం మొదలుపెట్టాడు.

ప్రవాహ ఉధృతికి ఆయన కొట్టుకునిపోవడం ఖాయమని బోయలు ఆందోళన చెందసాగారు. త్యాగయ్య వంటి మహా భక్తుడిని స్పర్శించినందుకు ఆనందపడిపోతూ కావేరీ మరింత దూకుడుగా పరుగులు తీయసాగింది. త్యాగయ్య అవతల తీరానికి చేరుకుంటూ ఉండగా, ఆయన వక్ష స్థలానికి ఏదో తగిలింది. ఏమిటా అని ఆయన చూడగా అవి తన ఇంట్లో అదృశ్యమైన సీతారాముల ప్రతిమలు.

త్యాగయ్య సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. పసిబిడ్డలను అక్కున చేర్చుకున్నట్టుగా ఆయన ఆ ప్రతిమలను హృదయానికి హత్తుకున్నాడు.కన్నతల్లి వంటి కావేరీ నది ఉప్పొంగడానికి కారణమేమిటో అప్పుడాయనకి అర్ధమైంది. జరిగింది తెలుసుకున్న గ్రామస్తులు త్యాగయ్యకు ... సీతారాములకు మేళతాళాలతో ఆహ్వానం పలికారు.భక్తుడు ... భగవంతుడు తిరిగి వచ్చినందుకు సంబరాలు జరుపుకున్నారు.


More Bhakti News