బ్రాహ్మణ పూజా ఫలితం

జీవితంలో ఎవరు ఏది సాధించాలన్నా అందుకు దేవుడి యొక్క అనుగ్రహం వుండాలి. ఆయన చల్లగా చూడాలేగానీ, తాము అనుకున్నట్టుగా జరుగుతుందనే విశ్వాసాన్ని చాలామంది వ్యక్తం చేస్తుంటారు. దేవుడి అనుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ పూజలు ... నోములు ... వ్రతాలు చేస్తుంటారు. పూజ అయినా ... నోములు - వ్రతాలే అయినా శాస్త్రం సూచించిన నియమాలను అనుసరించే చేయవలసి వుంటుంది.

కొన్ని ప్రత్యేక పూజలను ... వ్రతాలను బ్రాహ్మణుడితోనే జరిపించాలనేది ఈ నియమాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. సాధారణంగా వ్రతాలు .. నోములు ఎక్కువగా చేసిన వాళ్లు ... చూసిన వాళ్లు, ఆ పద్ధతికి అలవాటు పడిపోతారు. తమకి తెలిసినదే గదా .. బ్రాహ్మణుడిని పిలవడం ఎందుకని అనుకుంటూ వుంటారు.

మరి కొందరు బ్రాహ్మణులు అందుబాటులో లేరని చెప్పి కేసెట్ గానీ ... సీడీగాని పెట్టుకుని తంతు కానిచ్చేస్తుంటారు. బ్రాహ్మణుడి కోసం తిరిగే ఇబ్బంది తప్పిందనీ ... ఈ పద్ధతి ఏదో బాగానే వుందని అనుకుంటూ వుంటారు. అయితే ఏ వ్రతమైనా బ్రాహ్మణుడితోనే జరిపించాలని శాస్త్రం చెబుతోంది.

బ్రాహ్మణుడితో వ్రతం చేయించి ... ఆయనని పూజించి ... భోజనం పెట్టి ... దక్షిణ తాంబూలాలు సమర్పించినప్పుడే వ్రత ఫలితం దక్కుతుంది. బ్రాహ్మణుడు సంతృప్తి చెందితే వ్రత సంబంధమైన దైవం సంతృప్తి చెందుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది. అందువలన బ్రాహ్మణుడు లేకుండా గానీ, కేసెట్ పెట్టుకునిగాని వ్రతాలు చేసుకునే వారు, బ్రాహ్మణ పూజ వలన లభించే ఫలితాన్ని పొందలేరనే విషయాన్ని గ్రహించాలి.


More Bhakti News