మహిమగల హనుమ క్షేత్రం

రామాయణ మహాకావ్యం రాముడి గుణగణాలనే కాదు ... హనుమంతుడి ఔదార్యాన్ని కూడా అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. హనుమంతుడి పట్టుదల ... పరాక్రమం .. ప్రభుభక్తి .. సూక్ష్మపరిశీలన .. సమయస్పూర్తికి అద్దం పడుతుంది. ప్రభుభక్తి పరాయణుడిగానే కాదు, భక్తవత్సలుడిగా కూడా ఆయన అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు.

అలాంటి హనుమంతుడుని దర్శించడం వలన దుష్ట ప్రయోగాల వలన పడుతున్న బాధలకు విముక్తి లభిస్తుంది. చాలాకాలంగా విసిగిస్తోన్న కార్యాలకు అనుకూలత సిద్ధిస్తుంది. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకి ఆయన దండకానికి మించిన విరుగుడులేదు. ఇంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న కారణంగానే స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి.

ఆ జాబితాలోని మరో మారుతీ క్షేత్రంగా ఖమ్మం దర్శనమిస్తుంది. 19 వ శతాబ్దం తొలినాళ్లలో ఇక్కడి పంటకాలువలో బయటపడిన హనుమంతుడిని ఆ కాలువ గట్టునే ప్రతిష్ఠించారు. స్వయంభువు శిలపై హనుమ ముఖభాగం మాత్రమే కనిపిస్తూ వుంటుంది. వెనుక భాగంలో వీరాంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంజనేయస్వామి ఆలయం ... మూలమూర్తి సిందూర వర్ణంతో దర్శనమిస్తుంటాయి. కాలక్రమంలో ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

ఇదే ప్రాంగణంలో సీతారాముల మందిరం ... రమా సత్యనారాయణుల మందిరం కనిపిస్తాయి. హనుమజ్జయంతి ... శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. ఇక ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలో జరిగే బహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు ... స్వామివారి సేవలో పాల్గొని సంతోషంతో తరిస్తుంటారు.


More Bhakti News