పూజా సమయం

ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగడం వలన ... దైవం పట్ల విశ్వాసం ఏర్పడటం వలన చాలామంది నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. జీవితంలో ఎదురైన సంఘటనలు ... అనుభవాలను బట్టి వాళ్లు తమ ఇష్టదైవాలను ఆరాధిస్తూ వుంటారు. పూర్వం మహర్షులు ... మునులు బ్రహ్మీ ముహూర్తంలోనే పూజాది కార్యక్రమాలను నిర్వహించేవారు. నేటి ఆధునిక కాలంలో ఈ పద్ధతిని అతి కొద్దిమంది మాత్రమే పాటిస్తున్నారని అనుకోవచ్చు.

ఉదయాన్నే స్నానం చేసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకునిగాని ఎలాంటి ఆహారం తీసుకోని వాళ్లు వున్నట్టుగానే, తాపీగా నిద్రలేచి వీలుచూసుకుని పూజాది కార్యక్రమాలు చేసేవాళ్ళూ లేకపోలేదు. ఇక కొంతమంది ఉదయం వేళ బద్ధకించినందుకు తమని తాము తిట్టుకుంటూ మధ్యాహ్నం వేళలో పూజ చేస్తుంటారు. ఇక సాయంత్రం చేయవలసిన దీపారాధనను వివిధ కారణాల వలన వాయిదా వేసుకుంటూ ఏ రాత్రికో చేస్తుంటారు.

అయితే ఇలా తోచినప్పుడు ... తీరిక దొరికినప్పుడు పూజలు చేయవచ్చా? అంటే , చేయకూడదనే శాస్త్రం చెబుతోంది. ఇంటికి సంబంధించిన దైవారాధన వరకూ, సూర్యోదయ సమయం నుంచి ఉదయం తొమ్మిది గంటల లోపే పూజా కార్యక్రమాలు పూర్తికావాలని అంటోంది. అలాగే సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలలోగా పూజా కార్యక్రమాలు పూర్తికావాలి. ఈ సమయాన్ని దాటిచేసే పూజను అకాలపూజ అని అంటారు.

అకాలపూజ అంటే వేళ కాని వేళలో చేసే పూజ అని అర్థం. అకాల పూజ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం లేకపోవడమే కాకుండా, దోషాలు మూటగట్టుకో వలసి వస్తుంది. అందువలన శాస్త్రం నిర్దేశించిన సమయంలో పూజ చేయడం వలన మాత్రమే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని గ్రహించాలి.


More Bhakti News