స్వయంభువు శ్రీరాముడు

ఎక్కడ శ్రీరాముడు నెలకొని వుంటే అక్కడ అభయం వుంటుంది ... విజయం వుంటుంది ... సంతోషం వుంటుంది ... సంపద వుంటుంది. ధర్మస్వరూపుడైన శ్రీరాముడు, ప్రజల మనసు మందిరాలలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ కారణంగానే రామాలయాలు ఊరికొకటిగా కొలువుదీరాయి.

ఈ నేపథ్యంలో ఆయన స్వయంభువుగా ఆవిర్భవించిన అనేక క్షేత్రాలు భక్తజనుల ఆదరణను పొందుతున్నాయి. అలాంటి అరుదైన క్షేత్రంగా ఖమ్మం జిల్లా 'జీళ్ల చెరువు' దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి గుట్టపైనే కోదండ రాముడు కొలువై కనిపిస్తూ వుంటాడు. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తురాలికి కలలో రాముడు కనిపించి, తాను ఇక్కడ ఆవిర్భవించనున్నట్టు ఆనవాళ్లతో సహా చెప్పాడట.

మరునాడు ఉదయం ఆ భక్తురాలు తనకి వచ్చిన కల గురించి చుట్టుపక్కల వాళ్లకి చెప్పింది. దాంతో అంతాకలిసి ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఈ గుట్టపైకి చేరుకున్నారు. కలలో రాముడు చెప్పినట్టుగానే అక్కడ ఒక రాయిపై శ్రీరామచంద్రుడు వెలిసి వుండటం చూశారు. తమ గ్రామంలో శ్రీరామచంద్రుడు స్వయంభువుగా వెలిశాడంటూ సంతోషంతో పొంగిపోయారు. భక్తి శ్రద్ధలతో ఆ ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహించి, ఆ తరువాత కాలంలో ఆలయాన్ని నిర్మించారు.

ఇక ఈ ప్రాంతవాసులంతా ఈ రాముడినే నమ్ముకుని వుంటారు. తమకి సమస్యలోచ్చినా ... సంతోషం వచ్చినా ముందుగా ఈ రాముడికే చెప్పుకుంటారు. తమ బాధలు చెప్పుకున్నదే ఆలస్యం వెంటనే ఆయన తీర్చేస్తాడని చెబుతూ వుంటారు. శ్రీరామనవమి ... దసరా ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ వుంటారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. కోదండ రాముడికి తమ శక్తిమేర కానుకలను సమర్పిస్తూ వుంటారు.


More Bhakti News