బోలికొండ రంగనాథుడు

శ్రీమహావిష్ణువు శయనముద్రలో రంగనాథస్వామిగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. పచ్చని ప్రకృతి ఒడిలో ... ప్రశాంతమైన వాతావరణంలోని కొండ గుహల్లో ఆయన శయనముద్రలో దర్శనమిస్తుంటాడు. జగాలనేలే జగన్నాథుడు ప్రశాంతంగా పవళించిన తీరు మనోహరంగా అనిపిస్తుంటుంది. సుందరమూ ... సుకుమారము అయిన ఆ రూపం మనసుపై చెరగని ముద్రవేస్తుంటుంది.

అలాంటి సౌందర్య మూర్తిగా 'బోలికొండ రంగనాథుడు' కనిపిస్తాడు. అనంతపురం జిల్లా 'గుత్తి' పట్టణానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. స్వామివారు కొలువైన కొండపై అక్కడక్కడ మచ్చలు వంటి ముద్రలు వుండటం వలన ఈ కొండని 'బొల్లి కొండ' అనేవారు. కాలక్రమంలో అది కాస్తా 'బోలికొండ'గా మారిందని అంటారు. ఒకానొక కార్యార్థం భూలోకానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు, ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు.

తాము చేస్తోన్న విష్ణు నామస్మరణం వైకుంఠానికి కాకుండా భూలోకానికి పయనిస్తూ వుండటం గ్రహించిన మహర్షులు, వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. విశ్రాంతి తీసుకుంటోన్న శ్రీ మహావిష్ణువును కలుసుకుని ఆయన పాదాలకు భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. భూలోక వాసులను కరుణించడం కోసం ఆ కొండపైనే ఆవిర్భవించమని అభ్యర్ధించారు. అందుకు అంగీకరించిన శ్రీ మహావిష్ణువు అక్కడే వెలిసినట్టు స్థలపురాణం చెబుతోంది.

నాటి నుంచి స్వామివారికి నిత్యపూజాభిషేకాలు జరుగుతూ వస్తున్నాయి. ఎందరో మహర్షులు ... మహారాజులు స్వామివారి సేవలో తమ జన్మను సార్ధకం చేసుకున్నారు. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడి స్వామికి ప్రత్యేక పూజలు ... ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ వేడుకలో వేలాదిగా భక్తులు పాల్గొని, స్వామివారి కరుణాకటాక్షవీక్షణాలకు పాత్రులవుతుంటారు.


More Bhakti News