కొత్తకొండ వీరభద్రుడు

రుద్రాంశ సంభూతుడిగా అవతరించిన వీరభద్రుడు, తన అవతార కార్యం పూర్తి కాగానే అనేక ప్రదేశాల్లో కొలువై అశేష భక్త జన కోటిచే నిత్య నీరాజనాలు అందుకుంటూ వున్నాడు. శివుడి ఆదేశానుసారం దక్షుడిని సంహరించి విజయాన్ని సాధించిన కారణంగా, ఈ స్వామిని పూజించడం వలన విజయం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అలా భక్తులచే సేవలు అందుకుంటోన్న వీరభద్రుడు కరీంనగర్ జిల్లాలోని 'కొత్తకొండ'లో దర్శనమిస్తాడు.

కోరిన వరాలను ప్రసాదించడంలో కొత్తకొండ వీరభద్రుడు ముందుంటాడని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఇక్కడి స్వామివారిని పండితత్రయంలో ఒకడైన మల్లికార్జున పండితారాధ్యుడి మనుమడు 'కేదార పండితారాధ్యుడు' ప్రతిష్ఠించినట్టు ఆధారాలు వున్నాయి. ఎందరో మహార్షులు ... మహారాజులు ... మహాభక్తులు స్వామివారిని సేవించి, ఆయన మహిమను లోకానికి చాటిన దాఖలాలు వున్నాయి.

ప్రాచీన వైభవానికి ప్రతీకగా కనిపించే ఈ ఆలయంలో, భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామివారికి అభిషేకాలు చేసే అవకాశముంది. గర్భాలయం పక్కనే భద్రకాళి మందిరం దర్శనమిస్తుంది. అమ్మవారు పసుపు వర్ణం కలిగిన మోముతో, త్రిశూలాన్ని ఆయుధంగా కలిగి వుంటుంది. అమ్మవారి విశాల నేత్రాలు ... ముక్కెర అత్యంత ఆకర్షణీయంగా కన్పిస్తాయి. సిరిసంపదలను ... సంతాన సౌభాగ్యాలను కోరుకున్న భక్తులు, కృతజ్ఞతా పూర్వకంగా అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తూ వుంటారు.

ఇదే ప్రాంగణంలో దశభుజ గణపతి మందిరం ... అభయ ఆంజనేయ స్వామి మందిరం ... నవగ్రహ మంటపం కొలువై వుంటాయి. వీరభద్రుడు శివాంశ సంభూతుడు కావడం వలన శైవ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సంబరాలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తుంటారు ... భద్రకాళీ సమేత వీరభద్రుడి అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు.


More Bhakti News