శంభులింగేశ్వర క్షేత్రం

మహాశివుడి లీలా విశేషాలను గురించి పురాణాలు చెబుతున్నాయి ... అందుకు నిదర్శనంగా ఆయన క్షేత్రాలు అలరారుతున్నాయి. ఈ నేపథ్యంలో పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత మహిమాన్వితను చాటుకుంటున్నాయి. నల్గొండ జిల్లా 'మేళ్ల చెరువు'లో వెలుగొందుతోన్న శైవ క్షేత్రం కూడా ఈ కోవలోనిదే. ఇక్కడి శివుడిని 'శంభులింగేశ్వరుడు' గా భక్తులు కొలుస్తూ వుంటారు.

పూర్వం మేకలు తమ పాలతో మట్టి పుట్టను కరిగించడం వలన ఇక్కడి శివలింగం బైటపడిందని చరిత్ర చెబుతోంది. 12 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలను బట్టి తెలుస్తోంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం ... అందమైన మంటపాలు ... పొడవైన ప్రాకారాలు నాటి వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. ఇక్కడి నంది విగ్రహం జీవంతో తొణికిసలాడుతుంటుంది.

ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత వుంది. శివుడి తలపై గంగమ్మ ఏ స్థానంలో వుంటుందో ... అక్కడే ఈ శివలింగానికి చిన్నపాటి గుంట వుంటుంది. ఈ గుంటలో నిరంతరం నీరు ఊరుతూ వుంటుంది. అయితే ఎంతగా తోడినా నీరు తగ్గక పోవడం, తోడకుండా వుంటే పొర్లిపోవడం అనేవి జరగకపోవడం వింతగా ... విచిత్రంగా అనిపిస్తూ వుంటుంది. శివుడి తలపై గల ఈ గుంటలోని నీటిని చిన్న పూలమాలను ముంచి తీస్తూ, ఆ నీటిని తీర్థంగా ఇస్తుంటారు.

ఈ తీర్థాన్ని స్వీకరించడం వలన సమస్త వ్యాధులు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. పవిత్రమైన ఈ నీటిని తమ ఇంటి బావుల్లో కలపడం, తమ పంటపొలాల్లో చల్లడం వంటివి చేస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ... కార్తీకమాసంలోను స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించి తరిస్తుంటారు.


More Bhakti News