అన్నప్రసాదం విశిష్టత

'సర్వం జగన్నాథం' అనే మాటను మనం తరచూ వింటూనే వుంటాం. అంతటా తానై వున్నది జగన్నాథుడే ... అందరిలో ఉన్నదీ ఆ జగన్నాథుడే అనే అర్థంలో ఈ మాటను వాడుతుంటారు. ఈ మాట పుట్టింది 'పూరీ జగన్నాథ స్వామి' క్షేత్రంలో ... అదీ అక్కడి 'అన్నప్రసాదం' విషయంలో. సాధారణంగా దైవాన్ని బట్టి ... ఆ దైవం ఇష్టాన్ని బట్టి ... ఆనవాయతీని బట్టి ఒక్కోచోట ఒక్కో ప్రసాదం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది.

కొన్ని పుణ్యక్షేత్రాలలో పులిహోర ... మరికొన్ని పుణ్యక్షేత్రాల్లో పొంగలి ... ఇంకొన్ని పుణ్యక్షేత్రాలలో దధ్యోదనం అన్నప్రసాదాలుగా దైవానికి సమర్పించి భక్తులకు పంచుతుంటారు. అయితే నేరుగా అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచడం మనకు పూరీ జగన్నాథ క్షేత్రంలో దర్శనమిస్తూ వుంటుంది.

స్వామివారికి నైవేద్యం పెట్టగానే, పప్పుతో కూడిన ఆ అన్నప్రసాదాన్ని ఎవరికి కావలసినంత వాళ్లు తినేస్తుంటారు. ఆ పక్కనే గల గంగాళంలోని మజ్జిగను కూడా అలాగే తాగేస్తుంటారు. అంటు చేతులు ... ఎంగిలి అనే భావన రాకుండా అంతా ఆ ప్రసాదాన్ని ఆరగించి వెళుతుంటారు. ఈ నేపథ్యంలోనే 'సర్వం జగన్నాథం' అనే మాట పుట్టింది.

ఇక ఇక్కడ ఈ అన్నప్రసాదాన్ని వండే పద్ధతి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది. ఒక్కో పొయ్యిమీద వరసగా ఏడుకుండలు పెట్టి అన్నం వండుతారు. కింద కుండలో అన్నం మాడిపోవడం గానీ, పై కుండలోని అన్నం ఉడక్కపోవడం గాని జరగకపోవడం విశేషం. ఇక ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని అంటారు.


More Bhakti News