శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడుని ఆపదమొక్కుల వాడిగా భక్తులు సేవించి తరిస్తుంటారు. తిరుమలలో ఏడుకొండలవాడిగా కీర్తించబడుతూ, అనునిత్యం భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తుంటాడు. నిరంతరం నిలుచునే భక్తుల కష్టాలను వింటూ అలసిపోయిన స్వామికి బ్రహ్మోత్సవాలు కొత్త శక్తిని ... నూతన ఉత్సాహాన్ని ... ఉత్తేజాన్ని ప్రసాదిస్తూ వుంటాయి.

ఈ కారణంగానే ఉత్సవ మూర్తిగా స్వామి మరింత కళకళలాడుతూ కనిపిస్తుంటాడు. తన సన్నిధిలో పునీతులు కావడానికి వచ్చిన భక్త జన వాహినిని ఒకేచోట చూసి మురిసిపోతుంటాడు. స్వామి ఇక్కడ కొలువైన నాటి నుంచి బ్రహ్మదేవుడే ఇక్కడ ఉత్సవాలు జరిపిస్తూ వస్తున్నాడు. బ్రహ్మోత్సవాలకి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో గల వసంత మంటపానికి అర్చకులు మేళతాళాలతో చేరుకుంటారు.

ఇక్కడి పవిత్ర ప్రదేశంలోని భూదేవి ఆకారంనందు నుదురు ... చేతులు ... స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఆనందనిలయానికి చేరుకుంటారు. ఈ మట్టితో నింపిన తొమ్మిది కుండలను యాగశాలలో వుంచి, వాటిలో నవధాన్యాలను పోసి మొలకెత్తించే పనికి శ్రీకారం చుడతారు. దీనినే 'అంకురార్పణ' అంటారు. ఇక నూతన వస్త్రంపై గరుత్మంతుడి బొమ్మగీసి, మీన లగ్నంలో దానిని ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. దీనినే 'ధ్వజారోహణం' అంటారు. ఇదే అష్టదిక్పాలకులకు ... దేవతలకు ... వివిధ గణాలకు ఆహ్వానం పలుకుతుంటుంది.

ఇక తొలిరోజున స్వామి శ్రీదేవి - భూదేవి సమేతుడై 'పెద్ద శేషవాహనం' పై ఊరేగుతాడు. రెండో రోజున ఉదయం వేళలో అమ్మవార్లతో కలిసి ' చిన్న శేషవాహనం' పై దర్శనమిస్తాడు. ఆ రోజు రాత్రి శారదాదేవి రూపంలో 'హంస వాహనం' పై కనువిందు చేస్తాడు. మూడో రోజు ఉదయం 'సింహవాహనం' ... రాత్రివేళ 'ముత్యపు పందిరి వాహనం' అధిష్టించి తన భక్తుల ముచ్చట తీరుస్తాడు.

ఇక నాల్గొవ రోజు ఉదయం 'కల్పవృక్ష వాహనం' ... రాత్రికి 'సర్వ భూపాల వాహనం' పై కొలువై మాడవీధుల్లో సంతోషాల సందడి చేస్తాడు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన అయిదవ రోజున ఉదయం స్వామివారు 'మోహినీ రూపం'తో పల్లకీలో దర్శనమిస్తాడు. మిగతా వాహన సేవలు వాహన మంటపం నుంచి ఆరంభమైతే, ఈ పల్లకి స్వామివారి సన్నిధి నుంచి బయలుదేరడం విశేషం. ఇక ఈ రోజు రాత్రి స్వామివారు 'గరుడ వాహనం' అధిష్టించి భక్తులను అలరిస్తాడు.

ఆరో రోజున ఉదయం 'హనుమ వాహనం' ... రాత్రికి 'గజవాహనం' పై ఆశీనుడై భక్తజనకోటిని రంజింప జేస్తాడు. ఇక ఏడవ రోజున ఉదయం ' సూర్యప్రభ వాహనం' ... రాత్రికి 'చంద్రప్రభ వాహనం' పై కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తాడు. ఎనిమిదవ రోజు ఉదయం 'రథం' పైన ... రాత్రికి 'అశ్వ వాహనం' పైన స్వామి తన వైభవాన్ని చాటుకుంటాడు. వివిధ వాహన సేవలతో అలసిపోయిన స్వామికి తొమ్మిదో రోజున 'చక్రస్నానం' చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం ధ్వజస్తంభం పై నుంచి గరుడ పతాకాన్ని కిందికి దించడంతో బ్రహ్మోత్సవ సంబరాలు ముగిసినట్టు అవుతుంది.


More Bhakti News