శ్రీ కోదండ రామాలయం

సమస్త మానవాళికి ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరించి చూపడం కోసం శ్రీమహావిష్ణువు రామావతారాన్ని ధరించాడు. ఈ నేపథ్యంలో శ్రీ రాముడు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కుంటూ, అంతిమ విజయం ధర్మానిదేననే విషయాన్ని ఈ లోకానికి చాటిచెప్పాడు. ఈ కారణంగానే రాముడు ఆదర్శపురుషుడయ్యాడు ... అందరి హృదయాల్లో వెలిగే దీపమయ్యాడు.

పురుషులకు రాముడు ... స్త్రీలకు సీతమ్మవారు ఆదర్శప్రాయంగా నిలిచారు కనుకనే, ఈ రోజున ప్రతి గ్రామంలోను రామాలయాలు కొలువై వున్నాయి ... ప్రతి ఇంట్లోను సీతారాముల చిత్రపటాలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశిష్ట రామాలయాల జాబితాలో ఒకటిగా మనకి తిరుపతిలోని 'శ్రీ కోదండ రామాలయం' కనిపిస్తూ వుంటుంది. కొండపైగల కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి ముందుగానీ, ఆ తరువాత గాని భక్తులు తప్పనిసరిగా ఇక్కడి రాములవారిని దర్శించుకుంటూ వుంటారు.

అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలో అడుగుపెట్టగానే, మనసంతా సీతారాముల రూపాలు పరచుకుంటాయి. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు కొలువై వుంటారు. రాములవారికి సీతమ్మవారు కుడివైపున వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. మూలమూర్తులు దివ్యమైన తేజస్సుతో కళకళలాడుతూ భక్తుల కళ్లను కట్టిపడేస్తుంటాయి. స్వామివారికి ఎదురుగా ఆంజనేయస్వామి ఆలయం కనిపిస్తూ వుంటుంది.

సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో ముఖ మంటపం .. శయన మంటపం .. ఊంజల్ సేవ మంటపం .. విష్వక్సేనుల వారి మంటపం .. రామనుజులవారి మంటపం .. వాహన మంటపాలు .. ఆస్థాన మంటపాలు దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది కోదండ రామస్వామికి అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.

శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. స్వామివారి దర్శనభాగ్యాన్ని దక్కించుకుని, ఆయన వైభవాన్ని కనులారా తిలకించి తరిస్తుంటారు.


More Bhakti News