సత్యదేవుని క్షేత్రం

భక్తులకు తన సేవా భాగ్యాన్ని కల్పించడం కోసం ... వారిని అనుగ్రహించడం కోసం శ్రీమన్నారాయణుడు అనేక ప్రాంతాల్లో సత్యదేవుడిగా ఆవిర్భవించాడు. అలా సత్యనారాయణ స్వామిగా ఆయన పూజలు అందుకుంటోన్న క్షేత్రం, 'ఆదిలాబాద్' సమీపంలో అలరారుతోంది. ఆధ్యాత్మిక పరమైన ... చారిత్రక పరమైన నేపథ్యం గల ఈ క్షేత్రం, ఆనాటి వైభవానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది.

పూర్వం ఒక భక్తుడికి దర్శనమిచ్చిన స్వామి, ఆయన అభ్యర్ధన మేరకు 'జయనాథుడు' అనే పేరుతో ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఆ తరువాత 13 వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాలు వున్నాయి. ఇక ప్రతి ఏడాది కూడా మార్చి .. ఏప్రిల్ .. సెప్టెంబర్ .. అక్టోబర్ మాసాల్లో ఇక్కడి మూలమూర్తి పై సూర్య కిరణాలు ప్రసరించబడతాయి. ఈ విశేషాన్ని తిలకించి తరించడానికి అశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.

గర్భాలయంలో స్వామివారు శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటాడు. ఇక్కడి స్వామి భక్త వత్సలుడనీ ... అడిగిన వెంటనే అవసరమైనవి అనుగ్రహిస్తాడని భక్తులు చెబుతుంటారు. ఇక కార్తీక మాసంలో ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ వుంటాయి. ఇక ఇదే మాసంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే 'గరుడబలి' ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. సంతానంలేని దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే, వారి కోరిక నెరవేరుతుందని చెబుతుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ... సత్యదేవుడి మహిమలతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం, మరిచిపోలేని మధురమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News