విశిష్ట నారసింహ క్షేత్రం

లక్ష్మీనరసింహ స్వామి ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో మెదక్ జిల్లా 'పుల్లూరు' ఒకటిగా దర్శనమిస్తూ వుంటుంది. సహజంగానే నరసింహస్వామి తన అవతార రహస్యానికి తగినట్టుగానే కొండలపై గల గుహలలో కొలువై ఉంటూవుంటాడు. ఈ క్షేత్రంలో కూడా స్వామి అలా కొండపైనే కొలువై ఉంటాడు.

అయితే ఈ కొండ ఎత్తుగా కాకుండా చాలా విశాలంగా విస్తృతంగా పరచుకుని వుంటుంది. ఈ కారణంగా భక్తులు స్వామివారి సన్నిధికి పెద్దగా అలసట లేకుండానే చేరుకుంటూ వుంటారు. ఈ కొండపైకి చేరుకున్న తరువాత చుట్టూ ఒకసారి పరిశీలించి చూస్తే, పచ్చని ప్రకృతి మధ్యలో మనం ఉన్నట్టుగా తెలుస్తుంది. స్వామి ప్రకృతి ప్రేమికుడనే విషయం అర్థమవుతుంది. కొండపై స్వామి ఆలయ నిర్మాణం రాతిపలకల అమరికతో కనిపిస్తుంది. ప్రాకారాలు ... మంటపాలు ఆలయ ప్రాచీనతకు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తూ వుంటాయి.

మండు వేసవికాలంలో సైతం ఈ ఆలయంలో చల్లగా వుండటం విశేషంగా చెబుతారు. స్వయంభువుగా ఆవిర్భవించిన లక్ష్మీనరసింహ స్వామికి, కాకతీయ ప్రభువులు ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాలు వున్నాయి. ఈ సమయంలోనే వాళ్లు ఇదే కొండపై శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇక్కడి వేంకటేశ్వరుడు సుందరమైన సుమనోహరమైన రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు. కాకతీయ ప్రభువులు తరచూ ఈ ఆలయాలను దర్శించేవారట.

ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన రెండు జలాశయాలు కనిపిస్తూ వుంటాయి. వీటిని 'గుండాలు' అని అంటూ వుంటారు. స్వామి మహిమ కారణంగా ఇవి ఏర్పడ్డాయనీ, వీటిలో స్నానం చేయడం వలన చర్మ సంబంధమైన వ్యాధులు నశిస్తాయని చెబుతారు. మాఘమాసంలో ఇక్కడ ఘనంగా జరిగే ఉత్సవాలకు సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామి ఆశీస్సులు అందుకుని ఆనందంతో తిరిగి వెళుతుంటారు.


More Bhakti News