ఆదిదేవుడి ఆలయం

ప్రాచీనకాలం నుంచి ఎంతోమంది మహర్షులు ... మహారాజులు ... మహాభక్తులు ఆదిదేవుడిని లింగరూపంలో ప్రతిష్ఠించి పూజించారు. స్వామివారి అనుగ్రహంతో సంపదలను ... విజయాలను ... మోక్షాన్ని పొందారు. అప్పట్లో వాళ్లు నిర్మించిన ... సేవించిన క్షేత్రాలు నేటికీ భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని 'బిక్కవోలు'కి చెందిన శివాలయం కూడా ఈ కోవకి చెందినదే.

ఇక్కడి ఆలయాన్ని చాళుక్యులు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆలయం ఆనాటి నిర్మాణ శైలిలో దర్శనమిస్తూ వుంటుంది. గర్భాలయంలో శివలింగం చక్కని పరిమాణంలో అందంగా కనిపిస్తూ వుంటుంది. స్వామిని 'గోలింగేశ్వరుడు' గా భక్తులు పిలుస్తుంటారు. ఎందుకంటే చాళుక్యుల తరువాత ఇక్కడి స్వామి పూజాభిషేకాలకి దూరమైపోయాడు. దాంతో ఇక్కడి శివలింగంపై పుట్టలు పెరిగాయి.

చాలాకాలం తరువాత ఈ ప్రదేశానికి మేతకి వచ్చిన ఆవులు ఈ పుట్టపై పాలధారలను కురిపించసాగాయి. అది గమనించిన ఓ వ్యక్తి ఆ పుట్టని పరిశీలించగా, లోపల శివలింగం దర్శనమిచ్చింది. గోవుల యొక్క క్షీర ధారల వలన వెలుగు చూసిన స్వామి కావడం వలన, 'గోలింగేశ్వరుడు' గా ప్రసిద్ధి చెందాడు. స్వామివారి గర్భాలయం పక్కనే పార్వతీదేవి మందిరం కనిపిస్తుంది.

స్వామివారికి ప్రతి సోమవారం ... అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజాభిషేకాలు జరుపుతుంటారు. ఇక పర్వదినాల సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం ఇక్కడి స్వామిని సేవించి తరిస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన వ్యాధులు నశిస్తాయనీ, సంపదలు వృద్ధిచెందుతాయని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News