మహాభక్తుడి అగ్నిప్రవేశం

శివ భక్తుడైన సిరియాళుడు కష్టంలోను...నష్టంలోను అందరినీ ఆదుకుంటూ ఉంటాడు. దాంతో గ్రామపెద్దగా వ్యవహరించే భద్రయ్యని ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుంది. అది భరించలేకపోయిన భద్రయ్య, సిరియాళుడిని ఆ ఊరు నుంచి పంపించేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో కరువుకాటకాలు ఏర్పడతాయి.

ఇదే అదనుగా భావించిన భద్రయ్య, వర్షం కురిపించవలసిందిగా సిరియాళుడిని అడుగుతాడు. తనకి అంతటి శక్తి లేకపోయినా, ఒక నెలలో వర్షం కురుస్తుందని సిరియాళుడు చెబుతాడు. అలా వర్షం కురవని పక్షంలో అగ్నిప్రవేశం చేస్తానని అంటాడు. అందుకు భద్రయ్య ఆనందంగా అంగీకరిస్తాడు. ఆయన ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. వర్షం కురవని కారణంగా, అన్నమాట ప్రకారం అగ్నిప్రవేశం చేయమని సిరియాళుడిని భద్రయ్య ... ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తారు.

చితిని సిద్ధం చేసి సిరియాళుడిని అక్కడికి తీసుకువెళతారు. భర్తతో పాటు ఆత్మాహుతి చేసుకునేందుకు సిరియాళుడి భార్య సిద్ధపడుతుంది. తమ కుమారుడైన శంకరుడే తమ చితికి నిప్పు పెట్టాలని భద్రయ్యను కోరతారు. అందుకు ఆయన అంగీకరించడంతో, శంకరుడు ముందుకి వస్తాడు. తన తల్లిదండ్రులను శివుడు తప్పక కాపాడతాడనే పూర్తి విశ్వాసంతో ఆ బాలుడు చితికి నిప్పు పెడతాడు.

అంతే అంతా చూస్తుండగానే ఉరుములు .. మెరుపులతో కూడిన వర్షం వస్తుంది. ఆ వర్షం వలన చితి ఆరిపోవడమే కాకుండా, బావులు ... చెరువులు సైతం నిండుతాయి. సిరియాళ దంపతులు ఆ పరమ శివుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ పుణ్య దంపతుల పట్ల ఆ విధంగా ప్రవర్తించినందుకు భద్రయ్య ... ఆయన అనుచరులు తమని మన్నించమంటూ వారి పాదాలపై పడ్డారు.


More Bhakti News