భోజన నియమం

అన్నం పరబ్రహ్మ స్వరూపమనీ ... దాని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదనీ ... వృధా చేయకూడదని పెద్దలు చెబుతూ వచ్చారు. ఎంతో కష్టపడటం వలన ... ప్రకృతి సహకరించడం వలన ... దేవుడు అనుగ్రహించడం వలన అన్నం విస్తట్లోకి వస్తుంది. అలాంటి అన్నాన్ని ఎంతో పవిత్రంగా భావించి దైవ ప్రసాదంగా స్వీకరించాలనే శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే తినే ప్రతి మెతుకుపై వారి పేరు రాసి ఉంటుందనీ, లేకపోతే అది వారి నోటి వరకూ వెళ్లదని అంటూ వుంటారు.

పూర్వం ఎవరెన్ని కష్టాలుపడినా ఒక నిర్ణీత సమయమయ్యే సరికి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనాలు చేసేవారు. అది వాళ్ల సఖ్యతకి ... సంతృప్తికి నిదర్శనంగా నిలిచేది. ఇక ఇప్పుడు ఉద్యోగ వ్యాపారాల్లో పడి ఒక్కొక్కరూ ఒక్కోచోట ... ఒక్కోసమయానికి భోజనాలు చేయవలసి వస్తోంది. అది కూడా హడావిడిగా ... ఒక పని అయిందన్నట్టుగా. అయితే కాలమెంతమారినా భోజనం విషయంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలని శాస్త్రం చెబుతోంది.

ప్రతిరోజూ ఒకే విధమైన సమయానికి ప్రశాంతంగా భోజనం చేయాలి. ఇతర విషయాలను గురించి ఆలోచన చేస్తూ హడావిడిగా భోజనం చేయకూడదు. ఇక భోజనం చేస్తుండగా నవ్వడం ... మాట్లాడటం వంటివి చేయకూడదు. భోజన సమయంలో తుమ్ములు ... దగ్గులు వచ్చినప్పుడు, వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కుని ... పుక్కిలించి ... కనురెప్పలు తుడుచుకుని తిరిగి భోజనానికి ఉపక్రమించాలి.

నిద్ర మత్తులో వుండి కానీ, ఏడుస్తూ కాని భోజనం చేయకూడదు. భోజనం చేస్తూ వుండగా పొరిగింటి నుంచి ఏడుపులు వినిపించినా .. గొడవలు వినిపించినా, చేయి శుభ్రంగా కడుక్కుని ఆ తరువాత భోజనం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలను పాటించక పోవడం వలన కొన్ని దోషాలు కలగడమే కాకుండా, అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని శాస్త్రం స్పష్టం చేస్తోంది.


More Bhakti News