శ్రీ పట్టాభిరామ క్షేత్రం

'రామ' అనే రెండు అక్షరాలను పలికినంత మాత్రానే సమస్త కష్ట నష్టాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. దైవానికి అనేక రూపాలు ఉన్నప్పటికీ, వాటిలో రాముడు మరింత దగ్గరవాడుగా అందరికీ అనిపిస్తూ ఉంటాడు. ఈ కారణంగానే ఊరికో రామాలయం దర్శనమిస్తూ వుంటుంది. రాముడు ఉన్నాడనే ధైర్యంతోనే అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడుపుతుంటారు.

సాధారణమైన రామాలయాలపై కూడా భక్తులకి ఎంతో విశ్వాసం వుంటుంది. ఇక రామాయణంతో ముడిపడిన ఆలయమైతే ప్రత్యేకించి చెప్పేదేముంటుంది? అలా రామాయణ కాలంనాటిదిగా వెలుగొందుతోన్న క్షేత్రం చిత్తూరు జిల్లా 'వాయల్పాడు'లో దర్శనమిస్తుంది. ఈ ప్రదేశంలో 'వాల్మీకి మహర్షి' తపస్సు చేసుకోవడం ఒక విశేషమైతే, గర్భాలయంలో హనుమ సమేత సీతారామలక్ష్మణులతో పాటు భరత - శత్రుఘ్నులు కూడా కొలువై వుండటం మరో విశేషం.

శ్రీ రాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని గుర్తుకుతెచ్చే ఈ విగ్రహాలు కూడా ఎవరూ రూపొందించినవి కావు. ఇక్కడి పుట్టలో నుంచి ఈ మూలమూర్తులు బయటపడ్డాయి. 'వల్మీకం'(పుట్ట) నుంచి రాముడు ఆవిర్భవించాడు కాబట్టి, ఈ ప్రాంతానికి 'వాల్మీకి పురం' అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడ బోయలు ఎక్కువగా నివసించడం వలన 'బోయలపాడు' అని కూడా పిలిచేవాళ్లు. కాలక్రమంలో ఈ రెండూ కలిసి వాల్మీకపాడుగా ... వాయల్పాడుగా ప్రసిద్ధి చెందింది.

ప్రాచీనకాలం నుంచి ఎందరో మహర్షులు ... రాజులు ... మహాభక్తులు స్వామివారిని సేవించి తరించారు. అన్నమయ్య కూడా ఇక్కడి స్వామిని దర్శించి అనేక కీర్తనలతో అభిషేకించినట్టు ఆధారాలు వున్నాయి. విశాలమైన ప్రాంగణం ... ఎత్తైన రాజగోపురం ... పొడవైన ప్రాకారాలతో ఆలయం అందంగా తీర్చిదిద్దినట్టుగా వుంటుంది. ఇక్కడి రాజగోపురాన్ని ఓ ఆంగ్లేయ అధికారి స్వామివారి పట్ల భక్తితో నిర్మించడం విశేషం.

శ్రీరామనవమి రోజున కాకుండా, అమ్మవారి జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున కల్యాణం నిర్వహిస్తూ వుంటారు. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో వాల్మీకి, రుక్మిణీ - సత్యభామా సమేత శ్రీ కృష్ణుడు, శ్రీదేవి - భూదేవి సమేత రంగనాథుడు, అనంతపద్మనాభ స్వామి పూజలు అందుకుంటూ వుంటారు.


More Bhakti News