మూటలు మోసిన దేవుడు

శ్రీ పాండురంగస్వామి మహాభక్తుడు గోరాకుంభార్. మట్టికుండలు చేసి వాటిని అమ్మేయగా వచ్చిన సంపాదనతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉండేవాడు. తన సంపాదనకి సంబంధించిన దిగులు ఆయనకి ఎప్పుడూ వుండేది కాదు. ఎందుకంటే ఆయన ధ్యాసంతా ఆ పాండురంగడిపైనే వుండేది. స్వామిని ఆరాధించడమే కాదు, ఆయన భక్తులను సైతం అదే స్థాయిలో అభిమానించేవాడు. తన స్థాయికి తగినట్టుగా వారికి గౌరవ మర్యాదలు చేసి పంపించేవాడు.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి ఆ గ్రామానికి నామదేవుడు - జ్ఞానదేవుడు వచ్చారు. గ్రామపెద్దలు వారిని గౌరవంగా ఆహ్వానించి, ఆ పూటకి తమ ఇంట భోజనం చేయవలసిందిగా కోరారు. అయితే అందుకు వారు నిరాకరించారు. భక్తుడైన గోరా గురించి తాము ఎంతో గొప్పగా విన్నామనీ, ఆయనని కలిసి అక్కడే భోజనం చేస్తామని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న గోరా కంగారుపడ్డాడు. ఎందుకంటే ఇంట్లో వంటకి సంబంధించిన సామాగ్రి ఒక్కటి కూడా లేదు. కొనుక్కుని తీసుకు వద్దామంటే చేతిలో డబ్బు లేదు.

ఎవరినైనా అరువు అడుగుదామనే ఉద్దేశంతో తెలిసిన వాళ్లని కలిశాడు. గోరాకి ఎవరూ సాయం చేయవద్దని గ్రామపెద్ద చెప్పిన కారణంగా వాళ్లంతా మొహం చాటేశారు. భోజనాల వేళ అవుతున్నా ఎక్కడా అరువు దొరక్కపోవడంతో ఆయన పాండురంగడిపైనే భారం వేశాడు. అంతే ఆ స్వామి గోరా బావమరిది వేషంలో ఎడ్ల బండిపై అక్కడికి వచ్చాడు.

ఆ ఏడాది పంట బాగా పండిందని చెప్పి, ధాన్యం బస్తాలు .. కూరగాయల బస్తాలు మోసుకొచ్చి ఇంట్లో వేశాడు. ఖర్చులకి ఉంచమంటూ కొంత పైకం కూడా ఇచ్చి వెళ్లాడు. అంతే గోరా దంపతులు మనసులోనే ఆ పాండురంగడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సంతోషంతో వంట పనులు పూర్తి చేసి అతిథులను మర్యాదగా ఆహ్వానించి వారికి తృప్తిగా వడ్డించి సంతృప్తి చెందారు.


More Bhakti News