చక్కపీటకి చలి జ్వరం !

శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఆధ్యాత్మిక ప్రపంచాన భక్తిభావ పరిమళాలను వెదజల్లారు. ఆయన స్పర్శ వలన అనేక పుణ్యక్షేత్రాలు...పుణ్య తీర్థాలు మరింత పావనమై అలరారుతున్నాయి. అలాంటి శంకరుల జీవితంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి. అవి శంకరులవారి మహాత్మ్యానికి నిదర్శనాలుగా నేటికీ చెప్పుకోబడుతున్నాయి.

అలాంటి వాటిలో చక్కపీటకి చలిజ్వరం ఇచ్చిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా ... ఆశ్చర్యకరంగా అనిపిస్తూ వుంటుంది. ఒకసారి శంకరులవారు తీవ్రమైన చలిజ్వరంతో బాధపడసాగారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనని కలుసుకోవడానికి ఒక రాజుగారు మఠానికి వచ్చాడు. ఒకవైపున చలిజ్వరం ... మరోవైపున నీరసం కారణంగా లేచి కూర్చోవడానికి కూడా శంకరులు ఇబ్బందిపడ్డారు. మాట్లాడకుండా పంపించివేస్తే రాజుగారి మనసుకి కష్టం కలుగుతుందని ఆయన భావించారు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రాజుగారిని లోపలికి ఆహ్వానించారు. అక్కడ గోడకి చేరవేయబడిన రెండు పీటల్లో ఒకదానిని రాజుగారికి ఆసనంగా వేశారు. తాను వచ్చిన పని గురించి శంకరులవారితో ఆ రాజుగారు కొంతసేపు చర్చించాడు. ఆయన శంకరులవారితో మాట్లాడుతున్నంత సేపు, గోడకి చేరవేయబడిన పీట అదే పనిగా కదలసాగింది. అది చూసిన రాజుగారు అందుకు కారణమేమిటని అడిగాడు. నిజానికి ఆయనతో మాట్లాడే ఓపిక తనకి లేదనీ, అందువలన తన చలిజ్వరాన్ని ఆ పీటకి బదలాయించానని చెప్పారు శంకరులు. అందువల్లనే ఆ పీట చలితో వణుకుతూ వుందని అన్నాడు.

ఆ మాటకి ఆశ్చర్యపోయిన రాజు, ఆయనకి గల శక్తులతో అసలు రుగ్మతలు దరిచేరకుండా చేసుకోవచ్చుగా అంటూ సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఆయనతో మాట్లాడాలనే ఉద్దేశంతో కొంతసేపు మాత్రమే చలిజ్వరాన్ని పీటకి బదలాయించడం జరిగిందనీ, కర్మ ఫలితాలను ఎవరైనా సరే అనుభవించ వలసిందేనంటూ తిరిగి ఆ పీట నుంచి చలిజ్వరాన్ని తీసుకున్నారు శంకరులు. అంతే తాను ఏదైతే తెలుసుకోవాలని వచ్చానో, అది తెలుసుకున్నానంటూ ఆ రాజు ఆయనకి వినయంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


More Bhakti News