శ్రీనివాస మంగాపురం

శ్రీనివాసుడు ... పద్మావతీ అమ్మవారు నడయాడిన ప్రదేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి ... అత్యంత పవిత్రమైనవి. అలాంటి ప్రదేశాలను చూడటం ... అక్కడి నేలను స్పర్శించడం వలన జన్మజన్మాల పాపం నశిస్తుంది ... ముందు జన్మాలకి తరగని పుణ్య ఫలాలను అందిస్తుంది. అలాంటి విశిష్టమైన క్షేత్రమే 'శ్రీనివాస మంగాపురం'. ఇది తిరుపతికి సమీపంలో 'చంద్రగిరి' మండల పరిధిలో 'సువర్ణముఖీ' నదీ తీరంలో ఆవిర్భవించింది.

పూర్వం ఆకాశరాజు - ధరణీదేవిల కుమార్తె అయిన పద్మావతీ దేవిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నాడు. పద్మావతీదేవిని వెంటబెట్టుకుని 'నారాయణవనం' నుంచి తిరుమలకు బయలుదేరిన ఆయన, మార్గమధ్యంలో అగస్త్య మహర్షి ఆశ్రమం చెంత ఆగాడు. అగస్త్య మహర్షి అభ్యర్థన మేరకు ఆరుమాసాలపాటు ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇందుకు నిదర్శనంగానే స్వామి ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడిగా కొలువుదీరాడు. ఒకప్పుడు 'అలమేలు మంగాపురం'గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం, ఇప్పుడు ' శ్రీనివాస మంగాపురం' గా వెలుగొందుతోంది.

శిధిలావస్థలో వున్న ఇక్కడి ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడైన తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు పునరుద్ధరించాడు. ఒకానొక సమస్యను పరిష్కరించడానికిగాను చిన్న తిరుమలా చార్యులు సాక్షాత్తు అలమేలు మంగమ్మను పిలిచాడట. అక్కడున్న గ్రామస్తులందరికీ వినిపించేలా అమ్మవారు అదృశ్య రూపంలో న్యాయం చెప్పిందట. న్యాయం పొందినవారు ఇచ్చిన విరాళానికి మరికొంత కలిపి చిన్న తిరుమలా చార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది.

ఎత్తైన రాజగోపురం ... పొడవైన ప్రాకారాలు ... కళ్యాణ మంటపం ... యాగశాల ... కోనేరు ఆలయ వైభవాన్ని చాటిచెబుతూ వుంటాయి. 40 స్తంభాలు కలిగిన మహా మంటపం ... అర్థమంటపం ... సేనా మంటపం శోభాయమానంగా దర్శనమిస్తుంటాయి. అంతరాళంలో ఒకవైపున శయన ముద్రలో శ్రీ రంగనాథుడు ... మరో వైపున లక్ష్మీనారాయణుడు కొలువై వుంటారు. గర్భాలయంలో కళ్యాణ వేంకటేశ్వరుడు నయనమనోహరంగా కనిపిస్తూ ఉంటాడు.

తాళ్లపాక అన్నమయ్య పూజామందిరంలో కొలువై ఆయన పూజలు అందుకున్న ప్రతిమలు ... ఆయన ఉపయోగించిన 'చిడతలు' స్వామివారి సన్నిధిలో కనిపిస్తాయి. పంచబేరాలతో దర్శనమిచ్చే స్వామికి నిత్యోత్సవ .. వారోత్సవ .. మాసోత్సవ ... వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రదర్శనం, అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


More Bhakti News