కలను చెప్పకూడదా?

కలలు ఆలోచనలకు ప్రతిరూపాలు ... అందమైన ఊహలకు దృశ్య రూపాలు. కలలకు హృదయమే వేదిక ... మధురమైన కలలే మనసుకి వేడుక. మదిలోని భావాలకు ప్రతి కల అద్దం పడుతుంటుంది. అందుకే బాధగా ఉన్నప్పుడు పీడ కలలు ... సంతోషంగా ఉన్నప్పుడు ఉల్లాస భరితమైన కలలు వస్తూ వుంటాయి.

అయితే చాలా మంది తమకి వచ్చిన కలల గురించి ఇతరుల దగ్గర ప్రస్తావిస్తుంటారు. ఆనందకరమైన కలైతే అందరితోను కలిసి పంచుకుంటారు. ఇక పీడకలైతే బాగా దగ్గరి వారితో చెప్పుకుని ఆందోళన వ్యక్తం చేస్తారు. తమకి వచ్చిన కలకు అర్థమేమిటనే సందేహానికి సమాధానం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఇక కొంతమందికి దేవతలు కలలోకి వస్తుంటారు. దేవతలను చూసినట్టు ... వారితో మాట్లాడినట్టు, దేవాలయానికి వెళ్లినట్టు ... దేవతలు ప్రత్యక్షమై ఆశీర్వదించినట్టు కలలు వస్తుంటాయి. దేవతల అనుగ్రహం తమకి లభించబోతోందనేదానికి ఈ కలలు నిదర్శనమనుకుంటారు. ఆ సంతోషంతో తమకి వస్తోన్న కలల గురించి మరునాడు ఉదయాన్నే అందరితో చెప్పుకుంటూ వుంటారు. తమకి వచ్చిన కలకి రాబోయే ఫలితాలను గురించి చర్చిస్తారు.

అయితే ఎలాంటి కల వచ్చినా దాని గురించి ఎవరికీ చెప్పకూడదని 'స్వప్న శాస్త్రం' చెబుతోంది. ముఖ్యంగా దైవానికి సంబంధించిన ఏ కలను గురించి ఎవరి దగ్గరా ప్రస్తావించవద్దని అంటోంది. మనసుకి ఆనందం కలిగించే కలే అయినా, ఆందోళన కలిగించే కలే అయినా మనసులోనే దాచుకోవాలని స్పష్టం చేస్తోంది.


More Bhakti News