అందాల శ్రీనివాసుడు

జగన్నాథుడు ... జగన్మోహనుడు అయిన శ్రీనివాసుడు తిరుమలతో పాటు అనేక ప్రదేశాల్లో కొలువయ్యాడు ... కొంగుబంగారమయ్యాడు. ప్రకృతి సౌందర్యానికి పరవశించి ఆయనే కొలువుదీరిన క్షేత్రాలు కొన్నయితే, భక్తుల కోసం వెలసినవి ... భక్తులచే నిర్మించబడినవి మరికొన్ని. ఇక శ్రీ వేంకటేశుడు ఎంత దూరంలో వున్నా ... ఎంత ఎత్తులో వున్నా ఆయనని చేరుకోవడం భక్తులు కష్టంగా భావించరు.

ఇక ఆయన ఆలయాలు నిర్మించ దలచుకున్న భక్తులు కూడా ఆర్ధికపరమైన ఇబ్బందులను ఆయనకే వదిలి రంగంలోకి దిగుతుంటారు. తమ సంకల్ప బలంతో స్వామివారి అనుగ్రహాన్ని వేలాదిమందికి పంచుతుంటారు. అలా ఓ భక్తుడు నిర్మించిన ఆలయం మనకి నల్గొండ జిల్లా బీబీనగర్ సమీపంలోని 'బ్రాహ్మణపల్లి'లో దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే, భక్తిభావ పరిమళాలతో మనసు వికసిస్తుంది.

సువిశాలమైన ముఖమంటపం ఆలయ పవిత్రతకు అద్దంపడుతూ వుంటుంది. గర్భాలయంలో శ్రీ వేంకటేశుడి నిలువెత్తు విగ్రహం దర్శనమిస్తుంది. మనోహరం ... మహిమాన్వితం అయిన ఆ స్వామిరూపం ఆవేదనలను తొలగిస్తుంది ... ఆందోళనలను తరిమేస్తుంది. స్వామివారి గర్భాలయానికి రెండువైపులా పద్మావతీదేవి ... గోదాదేవి పూజలు అందుకుంటూ వుంటారు. ప్రతి శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో ఇక్కడ మూడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయం ప్రాంగణంలో శివుడు ... గణపతి ... హనుమ ... నాగదేవత ప్రత్యేక స్థానాల్లో కొలువై వుంటారు. ఇక్కడి స్వామిని సేవించడం వలన ఆరోగ్యం ... ఐశ్వర్యం చేకూరతాయని భక్తులు చెబుతుంటారు. ఈ విశ్వాసం కారణంగానే ఇక్కడి భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది.


More Bhakti News