స్వయంభువు శంకర క్షేత్రం

స్వయంభువు శంకర క్షేత్రం
మహాదేవుడుకి ఆనందం కలిగినా ... ఆగ్రహం కలిగినా వాటికి హద్దులు వుండవు. తన భక్తులను అనుగ్రహించడమే కాదు, వారిని బాధపెట్టే వారిపట్ల ఆగ్రహించడం కూడా ఆయనకి తెలుసు. అడిగిన వెంటనే ఎంత మాత్రం ఆలోచించకుండా అమ్మలా వరాలను ప్రసాదించడం ఆయన నైజం. అందుకే యుగయుగాలుగా దేవతలతోను ... తరతరాలుగా మానవులతోను ఆయన నిత్యనీరాజనాలు అందుకుంటూ వున్నాడు.

ఈ నేపథ్యంలో ఆయన అనేక ప్రాంతాల్లో స్వయంభువుగా ఆవిర్భవించాడు. అలా ఆయన కొలువుదీరిన అత్యంత ప్రాచీన క్షేత్రమే 'కొలనుపాక'. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే ప్రాచీనకాలంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన ప్రదేశం .. ప్రశాంతమైన వాతావరణం .. అందంగా తీర్చిదిద్దబడిన ఆలయాల సమూహం .. వివిధ దేవతామూర్తుల ప్రతిమలు .. అవతారపురుషుల విగ్రహాలు కనిపిస్తూ వుంటాయి.

గర్భాలయంలో 'సోమేశ్వరస్వామి' ... ఆ పక్కనే ప్రత్యేక మందిరంలో 'చండికాంబ' నిత్య పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో ' రేణుకా చార్యులు' ప్రతిమ కూడా కనిపిస్తూ వుంటుంది. ఈయన ఇక్కడి శివలింగం నుంచే ఉద్భవించి, వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడని స్థలపురాణం చెబుతోంది. శివలింగం మధ్యభాగం నుంచి ఆయన బయటికి వస్తున్నట్టుగానే విగ్రహం కనిపిస్తూ వుంటుంది.

ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున లింగం ... పంచముఖ లింగం ... సహస్ర లింగం ప్రత్యేక మందిరాలలో నెలకొని వుంటాయి. హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రాన్ని ఎంతోమంది మహర్షులు ... మహారాజులు దర్శించి తరించారు. ఇక్కడి స్వామి పాడిపంటలను ప్రసాదిస్తాడనీ, ఆపదల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

మహాశివరాత్రి సందర్భంగా ... కార్తీక మాసంలోను అధిక సంఖ్యలో భక్తులు సోమేశ్వరస్వామిని దర్శిస్తారు. పురాణ ప్రాశస్త్యం ... చారిత్రక విశిష్టత కలిగిన ఈ క్షేత్రదర్శనం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది ... పుణ్య ఫలాలను పుష్కలంగా అందిస్తుంది.

More Bhakti Articles