ఆగ్రహించిన బ్రహ్మం గారు

శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు వివిధ ప్రాంతాలను దర్శిస్తూ, అక్కడి ప్రజలకు తన కాలజ్ఞాన రచనను వినిపిస్తూ ముందుకు సాగసాగారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన ఓ సారి ఎడ్లబండిపై ఓ అగ్రహారం మీదుగా వెళ్లసాగాడు. అదే సమయంలో ఆ అగ్రహారానికి చెందిన పండితులు ఆయన బండికి ఎదురుపడ్డారు.

బ్రహ్మంగారి ఎడ్లబండిని అడ్డుకుని, ఆయన వేషభాషల గురించి వ్యంగంగా మాట్లాడారు. ఏమీ తెలియని వారి దగ్గర తోచినది చెప్పి మెప్పు పొందడం గొప్పకాదనీ, చేతనైతే తమతో వాదన చేయమని అన్నారు. తాను పండితుడిని కాదనీ, తన మానాన తనని వెళ్లనీయమని అన్నాడు బ్రహ్మంగారు. అయినా వాళ్లు వినిపించుకోకుండా, తమతో వాదించవలసినదేనంటూ పట్టుబట్టారు.

వారి భావనను అర్థం చేసుకున్న బ్రహ్మం గారు, పాండిత్యమనేది ఏ కొందరి సొంతమో కాదనీ ... ఆ సరస్వతీ దేవి అనుగ్రహం వల్లనే అది లభిస్తుందని చెప్పాడు. తమకి తెలిసినదే పాండిత్యమని అనుకోవడం అమాయకత్వమనీ, అది అహంకారానికి దారితీస్తుందని అన్నాడు. తమతో వాదనకి అంగీకరించకుండా ఆయన అలా మాట్లాడటం వారికి అసహనాన్ని కలిగించింది.

వాళ్లంతా కలిసి బండిలో నుంచి బ్రహ్మంగారిని బయటికిలాగారు. దాంతో ఆగ్రహావేశాలకి లోనైన బ్రహ్మం గారు, తనని అవమానపరిచినందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారని అన్నాడు. అంతే వాళ్లంతా చూస్తుండగానే అగ్రహారానికి మంటలు అంటుకున్నాయి. తమ ఇళ్లు తగలబడిపోతూ వుండటం చూసిన ఆ పండితులు, తమ తప్పుని మన్నించమంటూ వేడుకున్నారు. బ్రహ్మంగారు శాంతించడంతో, మంటలు తగ్గుముఖంపట్టాయి. ఆ పండితులు బ్రహ్మంగారి గొప్పతనాన్ని అంగీకరించి, ఆయనని బండిలో సాగనంపి అక్కడి నుంచి వెనుదిరిగారు.


More Bhakti News