మదన గోపాలస్వామి క్షేత్రం

శ్రీమన్నారాయణుడు తాను దేవుడినంటూ విశ్వరూపాన్ని ఆవిష్కరించినది ఒక్క కృష్ణావతారంలోనే. అందుకే కృష్ణావతారం ఎంతో ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. శ్రీ కృష్ణుడి లీలా విశేషాలను ... విన్యాసాలను గురించి ఎంతగా చదివినా ఇంకా చదవాలనిపిస్తూనే వుంటుంది, ఎన్నిమార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే వుంటుంది.

సమ్మోహితులను చేసే శ్రీకృష్ణుడి రూపాన్ని దర్శించుకుని,లోక కల్యాణం కోసం ఆయన ఆవిష్కరించిన లీలావిశేషాలను తలచుకుంటే కష్టాలు మబ్బుతెరల్లా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీకృష్ణుడు అనేక ప్రాంతాల్లో వివిధ నామాలతో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. విశిష్టమైన ఆ క్షేత్రాల జాబితాలో ఒకటిగా మనకి మహబూబ్ నగర్ జిల్లాలోని 'జటప్రోలు' దర్శనమిస్తుంది.

సీతను రావణుడు అపహరించుకు వెళుతుండగా జటాయువు అనే పక్షిరాజు అడ్డుపడింది. రావణుడు తన ఆయుధంతో ఆ పక్షిరాజు రెక్కను ఖండించాడు. జటాయువు రెక్క తెగి ఈ ప్రదేశంలో పడటం వలన ఈ ఊరుకి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి ఆలయం చూడగానే ఇది ప్రాచీనకాలానికి చెందినదనీ, మహిమాన్వితమైనదని తెలిసిపోతుంది. గర్భాలయంలో రుక్మిణీ సత్యభామా సమేతంగా కొలువైన కృష్ణుడు ... మదనగోపాలుడిగా పిలవబడుతుంటాడు.

ఇక్కడి స్వామిని దర్శించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. కృష్ణాష్టమి రోజున ... మిగతా పర్వదినాల్లోను ఇక్కడ ప్రత్యేక పూజలు ... విశేష సేవలు జరుపుతుంటారు. ఇక ఇక్కడే మల్లికార్జునస్వామి ఆలయం కూడా దర్శనమిస్తూ వుంటుంది. నిత్యాభిషేకాలతో నిర్మలంగా కనిపించే మహాదేవుడిని మనసారా స్మరించినంతనే అనుగ్రహిస్తాడని అంటారు. హరిహరులు కొలువైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News