సువర్ణ దాన ఫలితం

యజ్ఞ యాగాలు ... దానధర్మాలు మానవుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయనీ, వారిని పుణ్య మార్గాల్లో నడిపిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే పూర్వీకులు వాటిని ఆచరిస్తూ నీతివంతమైన ... సుఖవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. నాటి కాలంలో పాడిపంటలను ... బంగారాన్ని కలిగివున్న వారు సంపన్నులుగా పరిగణించబడ్డారు.

ఇక వీళ్లు ఏ శుభకార్యం చేసినా వీటిలో ఏదో ఒకటి దానం చేసేవారు. ధర్మాన్ని ఆచరిస్తూ .. ఆ మార్గంలో సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని దానం చేయమని తరువాత తరాలవారికి కూడా చెప్పారు. అయితే నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గోదానం ... భూదానం ... సువర్ణదానం ఉత్తమమైనవిగా చెప్పబడినప్పటికీ, నేడు ఈ దానాలు చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా అత్యుత్తమ ఫలితాలను ఇచ్చే సువర్ణదానానికి అంతా దూరంగా వుంటున్నారు.

అయితే సువర్ణదానం చేయడం వలన అంతకుమించిన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగానే పూర్వీకులు వివిధ కార్యక్రమాల్లో సందర్భాన్ని బట్టి, తమ శక్తికి తగినట్టుగా సువర్ణదానం చేసేవారు. సువర్ణదానం వలన జాతకపరమైన దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులతో బాధలు పడుతున్నవారికి ఉపశమనంగా సువర్ణదానం చెప్పబడింది.

విద్య ... వుద్యోగం ... వివాహ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న వారికి సైతం పరిష్కార మార్గంగా సువర్ణదానం చెప్పబడింది. ఇక ఏయే దోషాల పరిహారార్థం ఏయే సందర్భాల్లో ఏ రూపాల్లో సువర్ణదానాలు చేయాలనేది కూడా శాస్త్రం స్పష్టంగా వివరిస్తోంది. ఆ సూచనలను గురించి తెలుసుకుని తమ స్థాయికి తగినంతలోనే బంగారాన్ని దానం చేయడం వలన, ఆయా దోషాల నుంచి బయటపడతామనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.


More Bhakti News