శ్రీ సత్యమాంబ క్షేత్రం

అమ్మకన్నా ఎక్కువగా ఆత్మీయతను పంచేవారు ... అమ్మకన్నా ముందుగా అక్కున చేర్చుకునే వారు ఎవరూ వుండరు. అమ్మ హృదయం అమ్మలను కన్న అమ్మకే తప్ప మరొకరికి వుండే అవకాశమే లేదు. అందుకే ఆ తల్లి వెలసిన క్షేత్రాలు ఎప్పుడు చూసినా భక్తులతో సందడిగా వుంటాయి.

అమ్మ అనుగ్రహం వున్న వారికి దుష్ట శక్తులు దూరంగా వుంటాయి ... అమ్మ అనురాగానికి నోచుకున్న వారి దరికి ఆపదలు చేరవు. వివిధ రూపాల్లో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించిన అమ్మవారు ప్రకాశం జిల్లా 'కంభం' లో 'సత్యమాంబ' గా పూజలు అందుకుంటోంది. సత్యం చూపే తల్లిగా ఇక్కడి భక్తుల విశ్వాసం పొందిన కారణంగానే అమ్మవారు ఈ పేరుతో పిలవబడుతోంది.

ఈ క్షేత్రానికి ఎంతో చారిత్రక నేపథ్యం వుంది. చాళుక్యుల కాలంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. చాళుక్యులు తమ ఇలవేల్పుగా భావించి అమ్మవారికి వైభవంగా పూజాభిషేకాలు నిర్వహించేవారు. ఆ తరువాత కాలంలో కూడా అమ్మవారికి విశేష పూజలు జరుగుతూనే వచ్చాయి. శ్రీకృష్ణ దేవరాయలు ... ఆయన సతీమణులు కూడా ఇక్కడి అమ్మవారి మహిమ పట్ల ఎంతో విశ్వాసాన్ని కలిగివుండేవారని చరిత్ర చెబుతోంది.

ఆ తరువాత కూడా ఎంతోమంది రాజులు ... సంస్థానాధీశులు ... నవాబులు కూడా అమ్మవారి ఆరాధకులుగా వున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించిన పనులు తప్పనిసరిగా సఫలీకృతమవుతాయని వారు బలంగా నమ్మేవారు. ఈ నేపథ్యంలో అనుకోని కారణాల వలన అమ్మవారి పూజాభిషేకాలకు అంతరాయం కలిగినప్పుడు ఆమె ఆగ్రహించిన దాఖలాలు కూడా లేకపోలేదు.

ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, ఇక అమ్మవారికి ఎలాంటి లోటూ రాకుండా చూసుకోవడం మొదలుపెట్టారు. విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రారంభించారు. నాటి నుంచి కన్నబిడ్డల వలే కాపాడబడుతూ, సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.


More Bhakti News