ఒకనాటి తిరుమల తిరుపతి

శ్రీ మహావిష్ణువు కలియుగదైవమైన శ్రీనివాసుడుగా ఆవిర్భవించిన పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఈ క్షేత్రం యొక్క ఘనతను గురించి ఎంతగా చెప్పుకున్నా ఎంతో కొంత మిగిలే వుంటుంది. ఎన్నిసార్లు తెలుసుకుంటున్నా ఆసక్తికరంగానే అనిపిస్తూ వుంటుంది. ఇక్కడి శిలలు కొన్ని కోట్ల సంవత్సరాలనాటివిగా పరిశోధనలు చెబుతున్నాయి.

ఇప్పుడు కనిపిస్తోన్న కొండలన్నీ కూడా ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేవట. ఒక్క 'నారాయణాద్రి' పర్వత పైభాగం మాత్రమే సముద్రంలో నుంచి పైకి కనిపిస్తూ వుండేది. ఈ కారణంగానే శ్రీ మహావిష్ణువు మొదటిసారిగా ఈ ప్రదేశంలో తన పాదాలను మోపినట్టు చెబుతారు. ఆ తరువాత కాలంలో వాతావరణంలో సంభవించిన అనేక మార్పుల కారణంగా ఈ క్షేత్రానికి చెందిన కొండలు సముద్ర గర్భంలో నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. ఇక్కడి శిలాతోరణం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.

ఆదిమానవుడు వేటకోసం ఉపయోగించిన కొన్ని ఆయుధాలు ఇక్కడి పరిసర ప్రాంతాల్లో బయటపడటం ఈ క్షేత్ర ప్రాచీనతకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. శ్రీనివాసుడు ఇక్కడ ఆవిర్భవించాక దేవతలు ... మహర్షులు ... మహారాజులు ఆయనని దర్శిస్తూ .. తరిస్తూ వచ్చారు. 1933 లో టీ. టీ.డీ. ఏర్పడక ముందు హథీరామ్ బావాజీ మఠంవారు ఆలయ వ్యవహారాలు చూసుకునేవారు. భక్తులు కొండపైకి రావడానికి నానాఇబ్బందులు పడుతూ ఉండటంతో, ఈ మఠం వారు కాలిబాటలో మెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఆ తరువాత టీ. టీ.డీ. వారు మెట్ల మార్గాన్ని మరింత అభివృద్ధి చేశారు. రాయలవారు కొండకి వచ్చే మార్గం ... అన్నమయ్య వచ్చిన మార్గం మరింత కష్టతరమైనవి కావడంతో, 'అలిపిరి' దగ్గరి నుంచి సాగే కాలిబాట అనుకూలంగా భావించి ఆ దిశగా అభివృద్ధి పనులు కొనసాగాయి. ఇక ఇప్పుడు కొండ దిగువున వున్న 'తిరుపతి' ఒకప్పుడు 'కొత్తూరు' గా పిలవబడుతూ వుండేది.

క్రూర మృగాలు సంచరిస్తూ వుండటం వలన, చీకటి పడగానే పూజారులతో సహా అంతా తిరుమల నుంచి కొండ దిగువునగల ఈ గ్రామానికి వచ్చేవారు. ఇక్కడ 'గోవిందరాజస్వామి ఆలయం' నిర్మించబడిన తరువాత, రామానుజుల వారే ఈ గ్రామానికి 'తిరుపతి' గా నామకరణం చేసినట్టు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో తిరుమల తిరుపతి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఒకప్పుడు రోజుకి కొన్ని వందలమంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకోగా, నేడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకోవడం నిజంగా స్వామి మహిమకాక మరేమిటి?


More Bhakti News