కార్తీక దీపాలు

కార్తీకమాసం వచ్చిందంటే చాలు దీపారాధనలు ... దీపదానాలతో భక్తులు పుణ్య ఫలాలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతోన్న దీపంతో, గంగాదేవిని ఆరాధించడం కార్తీకమాస విశేషంగా కనిపిస్తూవుంటుంది. అందువలన వారి మనసు గెలుచుకుని అనుగ్రహానికి పాత్రులు కావడానికి అంతా ఆరాటపడుతూ వుంటారు.

ఈ సందర్భంలో సరస్సులు ... చెరువులు ... నదుల తీరాలు భక్తుల సందడితో .. దీపాలతో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటాయి. సాధారణంగా నీటిపై తేలే దొప్పలపై దీపాలు వెలిగించి జలాశయాల్లో వదులుతుంటారు. అయితే ఈ విధానంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. ఏ విధంగా దీపాలు వదలడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయంలో ఎన్నోరకాల సందేహాలతో సతమతమైపోతుంటారు.

ఈ సందేహాలకు శాస్త్రంలో సరైన సమాధానం కనిపిస్తుంది. దేవతలు వివిధ రకాల పుష్పాలను ... ఫలాలను ఇష్టపడినట్టుగానే, వివిధ రకాల పత్రాలను కూడా ఇష్టపడుతుంటారు. మర్రి పత్రాలు శ్రీ మహావిష్ణువుకి .. మోదుగ పత్రాలు శివుడుకి .. జిల్లేడు పత్రాలు సూర్యుడుకి ప్రీతికరమైనవని అంటారు.ఇలాగే మరికొంత మంది దేవతలకు మరికొన్ని పత్రాలు ప్రీతికరమైనవిగా చెప్పబడ్డాయి.

ఆయా దేవతల నుంచి ఫలితాలను ఆశించేవారు ఆ పత్రాలలో దీపాలు వదలాలని శాస్త్రం చెబుతోంది. అప్పుడే గంగమ్మ తల్లితో పాటు, ఆయా దేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని అంటోంది. ఇక దీపాలు వదిలేవాళ్లు పరిశుభ్రతను పాటిస్తూ పవిత్రంగా వుండాలనీ, దీపాలను విసురుగా కాకుండా సున్నితంగా వదలాలని శాస్త్రం చెబుతోంది. గంగమ్మను దీపాలతో అలంకరించి ఆరాధించినందుకు గాను తమ ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయనీ, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News