శ్రీ వీరాంజనేయ క్షేత్రం

సకల దేవతల వలన సమస్త శక్తులను పొందిన హనుమంతుడు, శ్రీరాముడి ప్రియ భక్తుడిగా వెలుగొందాడు. భక్తులు తమ దైవాన్ని ఏ విధంగా స్మరించాలో ... ఎంతగా సేవించాలో ఆచరించి చూపించాడు. హనుమంతుడిని పూజించిన వారికి దుష్టగ్రహ బాధలు ఉండవనీ, శని దోషాలు సైతం తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే వివిధ ప్రాంతాల్లో ఆయన క్షేత్రాలు అలరారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొలువుదీరిన మరో క్షేత్రం 'పంజిమ్'. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఈ క్షేత్రం 'గోవా' లో విరాజిల్లుతోంది. పూర్వం ఓ భక్తుడికి కలలో కనిపించి స్వామి ఆదేశించిన కారణంగా, ఇక్కడ ఈ ఆలయం నిర్మించబడిందని అంటారు.

విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో చలువరాతితో చేయబడిన మూలమూర్తి చాలా చిన్నదిగా కనిపిస్తూ వుంటుంది. ఈ వేదికకు ముందుగా నల్లరాతితో మలచబడిన మరో హనుమంతుడి విగ్రహం అదే పరిమాణంలో దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామివారికి అభిషేకాలు ... ఆకుపూజలు నిర్వహిస్తుంటారు.

శనిదోష నివారణార్థం స్వామికి జిల్లేడాకులు సమర్పిస్తూ వుంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినవారికి ఇక్కడి ప్రకృతి సౌందర్యం మానసికమైన ప్రశాంతతను ప్రసాదిస్తుంది. వీరాంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన అనారోగ్యాలు తొలగి ఆరోగ్యం కుదుటపడుతుంది. గ్రహపీడలు నివారించబడి సకల శుభాలు చేకూరతాయని అంటారు.


More Bhakti News