భద్రకాళీ ఆలయం

ఓరుగల్లుకు ఆధ్యాతిక సంపదను ... చారిత్రక వైభవాన్ని తెచ్చిన ఆలయం ... 'భద్రకాళి ఆలయం'. ప్రాచీన వైభవాన్ని కలిగివున్న ఈ ఆలయ అభివృద్ధికి కాకతీయ ప్రభువులు ఎన్నో విధాలుగా కృషి చేశారు. ఈ ఆలయానికి ఆనుకుని గణపతి దేవుడు చెరువు తవ్వించాడు. ఇక అమ్మవారి దర్శనం చేసుకోకుండా రుద్రమదేవి ఎలాంటి ఆహారం తీసుకునేది కాదట.

కాకతీయుల పరిపాలనా కాలం తరువాత వైభవాన్ని కోల్పోయిన ఈ దేవాలయం, విజయనగర రాజుల కాలంలో తిరిగి ఓ వెలుగు వెలిగింది. విజయనగర రాజుల పతనం తరువాత, మరుగున పడిపోయిన ఈ ఆలయం 1950లో వెలుగు చూసినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి.

పూర్వం ఇక్కడి అమ్మవారి మూలమూర్తిని చూడటానికి ఎవరూ సాహసించే వారు కాదట. పొడవైన నాలుక బయటికి పెట్టి అమ్మవారి రౌద్ర రూపం భయాన్ని గొలిపేలా వుండేది. దాంతో అమ్మవారికి ఎదురుగా పలుచటి తెరకడితే ... ఆ తెరలో నుంచి భక్తులు దర్శనం చేసుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యుల వారు, అమ్మవారి రుద్ర రూపం చూసి ఆమెను అనేక విధాలుగా స్తుతించాడట. అలా ఆమెను శాంత పరిచి భయంకరంగా బయటికి వచ్చిన ఆ నాలుకను లోపలికి నెట్టాడు.

అలా అమ్మవారిని సౌమ్య మూర్తిగా మార్చడంతో, ఆమెను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఆ తరువాత కాలంలో ఆలయం చుట్టూ గణపతి దేవుడు తవ్వించిన చెరువు కూడా అక్కడి వాతావరణాన్ని పూర్తి ఆహ్లాదంగా మార్చేసింది. ఈ ప్రాంగణంలోనే శివుడు .... సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువుదీరి కనిపిస్తారు. దేవీ నవరాత్రులను ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.


More Bhakti News