నిజం తెలుసుకున్న నామదేవుడు!

పండరీపురంలో ఆవిర్భవించిన పాండురంగడి భక్తుడు నామదేవుడు. నిరంతరం ఆయన పాండురంగడి నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. కాలినడకన ఎక్కడికి బయలుదేరినా, గమ్యం చేరేవరకూ ఆ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. ఆయన పాటలనువిని మిగతా భక్తులు తమని తాము మైమరచిపోయేవారు.

ప్రతిరోజు నామదేవుడు నైవేద్యం సమర్పించగానే, సాక్షాత్తు ఆ పాండురంగడే స్వయంగా వచ్చి వాటిని ఆరగించేవాడు. దాంతో తనని మించిన భక్తుడు లేడనే అహంభావం ఆయనలో తలెత్తింది. ఈ నేపథ్యంలో ఒకరోజున ఆయన ఎంతగా ప్రార్ధించినా పాండురంగడు రాలేదు ... నైవేద్యం స్వీకరించలేదు. దాంతో తాను చేసిన అపరాధమేమిటో తెలియక నామదేవుడు ఆవేదన చెందాడు.

నేరుగా జ్ఞానదేవుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా ఆయనకి వివరించాడు. తాను సమర్పించిన నైవేద్యం స్వామి స్వీకరించకపోవడానికి గల కారణమేమిటో అర్థంకావడంలేదని అన్నాడు. మరో భక్తుడెవరో స్వామిని పిలిచి ఉంటాడనీ, ఆయన అక్కడికే వెళ్లి ఉంటాడని జ్ఞానదేవుడు చెప్పాడు. తన కన్నా గొప్ప భక్తుడు వుండే అవకాశంలేదని ఆయనతో అన్నాడు నామదేవుడు.

ఆయన కళ్ళు తెరిపించాలనుకున్న జ్ఞానదేవుడు, తన ఆతిథ్యం స్వీకరించి వెళ్లమని నామదేవుడిని కోరాడు. అయితే అందుకు అవసరమైన వంట సామాగ్రి అక్కడ లేకపోవడంతో, ఆలస్యమవుతుందేమోనని అన్నాడు నామదేవుడు. అలాంటిదేవీ లేదంటూ పాండురంగడిని ప్రార్ధించి, మోకాళ్లపై వంగాడు జ్ఞానదేవుడు. ఆయన ఉదరంలో అగ్ని ప్రజ్వరిల్లగా వీపు పెనంలా వేడెక్కింది.

పొగలు వస్తోన్న జ్ఞానదేవుడి వీపుపై ఆయన చెల్లెలు వంట పాత్రలు వుంచి క్షణాల్లో వంట పూర్తిచేసింది. ఈ దృశ్యం చూసి నామదేవుడు ఆశ్చర్యపోయాడు. తనకంటే భక్తిలో జ్ఞానదేవుడు గొప్పవాడనీ, అలాగే తమ ఇద్దరికంటే గొప్ప భక్తుడు కూడా వుండే ఉంటాడని ఆయనకి అర్థమైంది. అంతటి భక్తుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే స్వామి జాడ తెలిసినట్టేనని అనుకున్నాడు. అందుకోసం ఆయన అక్కడినుంచే దేశసంచారం మొదలు పెట్టాడు.


More Bhakti News