శక్తి స్వరూపిణి క్షేత్రం

''అమ్మా'' అని ఆర్తితో పిలిచిన మరుక్షణమే జగజ్జనని అయిన అమ్మవారు తన బిడ్డల చెంతకి చేరి, వారి కష్టనష్టాలను దూరంచేస్తూ వుంటుంది. తన బిడ్డలకు అనురాగామృతాన్ని పంచే అమ్మవారు, వారికి కీడు తలపెట్టే వారిపై ఆగ్రహావేశాలతో విరుచుకుపడుతుంది. ఈ విషయంలో ఆలస్యం జరగకూడదనేనేమో, వివిధ రూపాల్లో అనేక ప్రాంతాల్లో కొలువైవుంది.

అలా ఆదిపరాశక్తి అయిన అమ్మవారు 'శ్రీ రాజరాజేశ్వరీ దేవి' గా కొలువుదీరిన క్షేత్రం మనకి ఖమ్మంలో కనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారు ఆప్యాతానురాగాలను ఆవిష్కరించే అమృతమూర్తిలా దర్శనమిస్తూ వుంటుంది. చక్కని ముక్కెర ...విశాలమైన నేత్రాలతో ... నుదుటున కుంకుమతో ... సర్వాభరణాలతో అమ్మవారు కళకళలాడుతూ కనిపిస్తుంది. గర్భాలయానికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం దర్శనమిస్తుంటుంది.

అమ్మవారు సకల సంపదలను ... సంతాన సౌభాగ్యాలను అందిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగా అనునిత్యం అమ్మవారికి జరిగే పూజాభిషేకాలలో అంతా పాల్గొంటూ వుంటారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే శివుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి భక్తులు స్వామిని 'భోగలింగేశ్వరుడు' గా కొలుస్తుంటారు. స్వామివారికి ప్రతి సోమవారం రోజున మహారుద్రాభిషేకం జరుపుతుంటారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి ... అమ్మవారికి ప్రత్యేక పూజలు ... విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తూ వుంటారు.


More Bhakti News